తన ప్రభుత్వం గురించి ఇంటింటికి వెళ్లి చెప్పాలని వాలంటీర్లను కూడా జగన్ బతిమాలుకుంటున్నారు. పార్టీ నేతలు..క్యాడర్ మొత్తం ఉన్నా.. వాలంటీర్లే తనకు దిక్కన్నట్లుగా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది. వాలంటీర్లకు వందనం అంటూ. ఓ కార్యక్రమం పెట్టిన ఆయన .. చివరికి వారికి లీడర్లను చేస్తానని కూడా హామీ ఇచ్చారు. ఎలాంటి లీడర్లను చేస్తారో తెలియదు కానీ.. వాలంటీర్లు వైసీపీ కోసం పని చేయాలని..అలా చేస్తే చాలా పనులవుతాయని ఆశ పెట్టడానికి వెనుకాడలేదు.
అదే పనిగా వాలంటీర్లను పొగిడేసిన ఆయన మీ రాజకీయ హక్కులకు, అభ్యుదయ ఆదర్శ భావాలకు ఎలాంటి ఆటంకాలు, అవరోధాలు ఉండవని హామీ ఇచ్చారు. వాలంటీర్లను ఉద్దేశించి నేను చేసిన మొదటి ప్రసంగాన్ని మీరు గుర్తుకు తెచ్చుకోవాలని.. అప్పట్లోనే తాను లీడర్లుగా చేస్తానని చెప్పానని గుర్తు చేశారు. ఆ మాటను గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ప్రతి ఇంటికీ ఎక్కువసార్లు వెళ్లాలని జగన్ కోరారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాను వారికి చూపించాలన్నారు. చేసిన మంచిపై ప్రజలు ఆలోచించేలా చేయాల్సిన బాధ్యత మీదేనని చెప్పుకొచ్చారు.
సీఎం జగన్ వాలంటీర్లే తమ ప్రభుత్వం గురించి ప్రజలకు చెబుతారని గట్టి నమ్మకం పెట్టుకున్నారు . పార్టీ నేతల్లో ఉన్న అసంతృప్తిని కూడా పెద్దగా పట్టించుకోకుండా వాలంటీర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు సీఎం జగన్ పై ఉన్నాయి. ఇప్పుడు అదే పద్దతిలో ఆయన వాలంటీర్లే తనకు దిక్కన్నట్లుగా ప్రసంగించడం పార్టీ నేతలను ఆశ్చర్య పరుస్తోంది. ప్రతి ఇంటికి మంచి చేస్తే.. మంచి జరిగిన వాళ్లు ఓట్లు వేస్తారు కదా.. వాళ్ల కి మంచి జరిగిందని వాలంటీర్లు చెప్పాలా అనే ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి.
వాలంటీర్ల నిర్వాకాల వల్లనే ఎక్కవ మంది ఓటర్లు వైసీపీకి దూరం అవుతున్నారన్న ప్రచారం ఉంది. అయినప్పటికీ వాలంటీర్లనే నమ్ముకోవడం .. పార్టీ క్యాడర్ ను విస్మరించడం తన నెత్తి మీద తాను చేయి పెట్టుకున్నట్లేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.