ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఇంకా రాజీనామాల గురించే మాట్లాడుతున్నారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేశారనీ, తెలుగుదేశం ఎంపీలు చెయ్యలేదనే అంటున్నారు. పాదయాత్రలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయనున్న ఒక రోజు నిరాహార దీక్షపై విమర్శలు చేశారు. దీక్ష పేరుతో మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా విషయంలో రాజీపడిపోయి, ఇప్పుడు పోరాటం చేస్తే ప్రయోజనం ఏముంటుందని వ్యాఖ్యానించారు.
హోదా సాధన కోసం తాము అలుపెరుగక పోరాటం చేస్తున్నామనీ, దాన్లో భాగంగానే తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామాలు చేశారన్నారు. తమతోపాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి ఉంటే ఈపాటికి ప్రత్యేక హోదా వచ్చేసేదన్నారు. ఆంధ్రాకి చెందిన 25 మంది లోక్ సభ ఎంపీలు ఒకేసారి రాజీనామాలు చేసి, దీక్షకు దిగితే దేశవ్యాప్తంగా ఏపీ సమస్య చర్చనీయం అయ్యేదనీ, తద్వారా కేంద్రంపై మరింత ఒత్తిడి పెరిగేదని జగన్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు దీక్ష చేయడం వల్ల లాభం ఏముందని ప్రశ్నించారు.
ఏపీ విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై జాతీయ స్థాయిలో చర్చ జరగడం లేదనీ, కేంద్రంపై ఒత్తిడి రాలేదనీ జగన్ అనుకుంటున్నట్టున్నారు. ఎన్డీయేకి టీడీపీ ఎదురుతిరగడంతోనే ఏపీ సమస్యలు జాతీయ స్థాయి చర్చనీయాంశంమైంది. ఆ తరువాత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లడం, వివిధ పార్టీలకు చెందిన ప్రముఖ నేతల్ని కలవడం, జాతీయ మీడియాకి ఏపీ సమస్యలపై ప్రెజెంటేషన్ ఇవ్వడం… ఇవన్నీ జగన్ గమనించలేదేమో! అంతేనా, చంద్రబాబు ఇంటర్వ్యూలను ప్రసారం చెయ్యొద్దంటూ కూడా కొన్ని జాతీయ ఛానెళ్లకు భాజపా వర్గాల నుంచి ఒత్తిళ్లు వచ్చాయనే కథనాలు జగన్ దృష్టికి రాలేదేమో. అంతెందుకు.. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, అక్కడ స్థిరపడ్డ తెలుగువారు తమకు వ్యతిరేకంగా ఓట్లేస్తారేమో అనే భాజపా ఆందోళన చెందుతూ ఉండటం… ఇదీ జగన్ దృష్టికి వచ్చి ఉండదేమో! ఇది ఏపీ సమస్యల ఒత్తిడి ప్రభావమే కదా. జాతీయ స్థాయిలో చర్చ అంటే ఇంకా ఏం జరగాలి, ఎలా జరగాలి..? అయినా, ఏపీ నుంచి 25 మంది ఎంపీలు రాజీనామా చేసి తప్పుకున్నా మోడీ ప్రభుత్వం పడిపోదు. అందులో వైకాపా ఐదుగురూ లెక్కల్లోలేనివారు. ఎన్డీయే భాగస్వాములు కాదు కదా!
రాజీనాామాలు చేసి ఏం సాధిస్తారు..? ప్రజల తరఫున పోరాడండి అంటూ ఓట్లేసి చట్టసభలకు నాయకులను పంపితే… రాజీనామాలే పోరాటం అంటూ జగన్ వక్రభాష్యం చెబితే ఏమనుకోవాలి..?