26 నెలలుగా జన రంజక పాలన అందిస్తున్నామని ఏపీ సీఎం జగన్ ఆగస్టు పదిహేనో తేదీ సందర్భంగా జాతీయజెండా ఆవిష్కరించి చేసి ప్రసంగంలో ప్రకటించారు. పాదయాత్రలో అన్ని వర్గాల సమస్యలను తెలుసుకని.. అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు మేలు జరిగేలా ప్రభుత్వం చూస్తోందని జగన్ తెలిపారు. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా రాష్ట్ర గతిని మారుస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని సీఎం వివరించారు .దాని వల్ల ఎలా మేరు జరుగుతుందో విశ్లేషించారు. అంతా బాగానే ఉన్నా.. ఆయన తమ ప్రభుత్వం తీసుకున్న అత్యంత కీలక నిర్ణయం అయిన మూడు రాజధానుల ప్రస్తావన మాత్రం తీసుకు రాలేదు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం మూడు రాజధానులు చేసి తీరతామని చాలా కాలంగా ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అందే.. ఇలాంటి అధికారిక కార్యక్రమాల్లో ఖచ్చితంగా ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ ఈ సారి ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన లేదు. దీనిపై రాజకీయవర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సీఎం జగన్ రాసుకొచ్చిన స్క్రిప్ట్ చదువుతారు కాబట్టి మర్చిపోయే అవకాశం లేదని.. స్క్రిప్ట్ ప్రిపేర్ చేసిన వారు మర్చిపోయి ఉండాలి లేదా… వ్యూహాత్మకంగా ప్రస్తావించడం మానేసి అయినా ఉండాలని అంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి తత్వం ప్రకారం చూస్తే. .ఆయన వ్యూహాత్మకంగా మూడు రాజధానుల ప్రస్తావన చేయకుండా ప్రసంగించడం అనేది ఉండదని అంటున్నారు. అలాగే ఆయన ప్రసంగంలో లేదని చెప్పి… మూడు రాజధానులపై వెనక్కి తగ్గినట్లు కాదని కొంత మంది అంటున్నారు.
సీఎం జగన్ ప్రసంగంలో ఏమి ఉన్నాయన్న దానికన్నా ఏమి లేవు.. ఎందుకు లేవన్న చర్చే ఇప్పుడు ఎక్కువగా సాగుతోంది. ఉన్న అంశాలపై ఆయా వర్గాలు చర్చించుకుటున్నాయి. ఉద్యోగుల సంక్షేమం కోసం చాలా చేశామని జగన్ ప్రకటించడంతో ఉద్యోగులు.. ఏం చేశారా అని వెదుక్కోవడం ప్రారంభించారు. ఇతర అంశాల్లోనూ సీఎం ప్రసంగం స్థాయిలో బయట అమలు లేదని నేరుగా సోషల్ మీడియాలోనే ఫీడ్ బ్యాక్ వినిపిస్తున్నారు.