పరిపాలనా వికేంద్రీకరణ విషయంలో.. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. చట్టం అయ్యేంత వరకూ.. ఎలాంటి శాఖల తరలింపు చేపట్టవద్దని.. అలా చేస్తే.. తాము అధికారుల వ్యక్తిగత ఖాతాల నుంచి సొమ్ము వసూలు చేస్తామని హెచ్చరించింది. ఏసీబీ, సీబీఐ విచారణ జరిపిస్తామని కూడా వార్నింగ్ ఇచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం.. ఈ విషయంలో వెనక్కి తగ్గాలనుకోవడం లేదు. వ్యూహాత్మకంగా ఆయన ముందుగా కర్నూలుకు .. న్యాయవిభాగాలకు సంబధించిన కొన్ని కార్యాలయాల తరలింపునకు ఆదేశాలు జారీ చేశారు. విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ చైర్మన్ సభ్యుల ఆఫీస్లను కర్నూలుకు తరలించాలని ఆదేశిస్తూ.. అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ విభాగాలు.. వెలగపూడి సచివాలయంలో ఉన్నాయి.
హైకోర్టు ఆదేశాలను లెక్క చేయని ప్రభుత్వం..!
కర్నూలులో న్యాయరాజధాని పెడతామని చెప్పిన జగన్.. అక్కడ హైకోర్టుతో పాటు న్యాయపరమైన అన్ని శాఖలు ఉండేలా చూస్తామన్నారు. హైకోర్టు ఏర్పాటు కోసం.. ఇంత వరకూ కేంద్రానికి ఎలాంటి విజ్ఞప్తి చేయలేదు. హైకోర్టు ఏర్పాటు పూర్తిగా కేంద్రం చేతుల్లోని వ్యవహారం. ప్రభుత్వ అధీనంలో ఉండే న్యాయవిభాగాలను సొంత నిర్ణయంతో తరలించుకోవచ్చు. అయితే.. రాజధాని వివాదం కోర్టుల్లో ఉండటంతో.. హైకోర్టులో.. తరలించవద్దని రూలింగ్ ఇచ్చింది. అయినప్పటికీ.. తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.
అడ్డుకుంటున్నారన్న ప్రచారం కోసమేన్యాయశాఖల తరలింపు ఆదేశాలు..!?
విశాఖకు ఆఫీసుల తరలింపు విషయం కన్నా… కర్నూలుకు కొన్ని న్యాయవిభాగాలు తరలిస్తే.. ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని జగన్మోహన్ రెడ్డి భావించినట్లుగా చెబుతున్నారు. కర్నూలుకు తరలిస్తే ఎవరూ అడ్డుకోలేరని.. ఎవరైనా అడ్డుకున్నా.. రాజకీయంగా దూకుడైన ప్రకటనలతో దూసుకెళ్లవచ్చని జగన్ భావించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో న్యాయస్థానాలను కూడా ఖాతరు చేయాల్సిన అవసరం లేదని.. జగన్ ఓ అంచాకు వచ్చినట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు.. కర్నూలుకు కొన్ని న్యాయపరమైన ఆఫీసులు తరలిస్తే..తర్వాత విశాఖకు మిగతా వాటిని తరలించడానికి అడ్డంకులు ఉండవని అంచనా వేసినట్లుగా చెబుతున్నారు.
హైకోర్టు అమరావతిలో.. న్యాయవిభాగాలు కర్నూలులో ఉంటే ఎలా..?
కర్నూలుకు హైకోర్టు మారిన తర్వాత ప్రభుత్వ న్యాయవిభాగాలన్నీ.. అక్కడికి మార్చడం సమంజసంగా ఉంటుంది. ఎందుకంటే.. ప్రభుత్వ న్యాయవిభాగానికి పూర్తిగా హైకోర్టుతోనే పని ఉంటుంది. ప్రతీ ఉన్నతాధికారి.. హైకోర్టు వ్యవహారాల్లో తలమునకులుగా ఉంటారు. ప్రభుత్వంపై వివిధ వర్గాలు దాఖలు చేసి పిటిషన్లన్నీ.. ఈ న్యాయశాఖలే చూస్తాయి. అవన్నీ.. రాజధాని పరిధిలోని కోర్టుల్లోనే ఉంటాయి. ఎక్కువగా హైకోర్టులో ఉంటాయి. ఇప్పుడు.. హైకోర్టు అమరావతిలోనే ఉండి.. న్యాయవిభాగాలు.. కర్నూలుకు వెళ్లిపోతే.. ఎదురయ్యే కష్టాలు మామూలుగా ఉండవు. కానీ ఉన్నతాధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి.