వాలంటీర్లు ఎవరు .. వైసీపీ కార్యకర్తలు. ఈ విషయాన్ని ఎవరో చెప్పలేదు.. వైసీపీ నేతలే చెప్పారు. పదేపదే చెప్పారు. ఎన్నికల సమయంలో వాడుకున్నారు. ఎన్నికలకూ ముందు వారితో పార్టీ పనులే చేయించుకున్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి బ్లాక్ మెయిల్ చేసే బాధ్యత వారికే ఇచ్చారు. చివరికి వారి సర్వీస్ ను పొడిగించకుండా చేశారు. తాము ఎన్నికలకు పోయే ముందే వాలంటీర్లు లేరని తేల్చేశారు.
ఇప్పుడు వారంతా రోడ్డున పడ్డారు. వారితో ఇప్పుడు మళ్లీ రోడ్డెక్కించి మాకు ఉద్యోగాలివ్వాలని అక్కడక్కడా స్కిట్లు ప్రదర్శించే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. కానీ వాలంటీర్ల జీవితాలను వైసీపీ కోసం ఉపయోగించుకుని ఇప్పుడు అలా ఎలా వదిలేస్తారని ఎక్కువ మంది జగన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. వారి కోసం ఏదో ఒకటి చేయాలని అంటున్నారు. కానీ జగన్ రెడ్డి మాత్రం మాకేం సంబంధం అన్నట్లుగా ఉన్నారు. వారి గురించి ఒక్క సారి కూడా మాట్లాడటం లేదు.
ఎన్నికలకు ముందు నాయకుల్ని చేస్తానని ప్రకటనలు చేశారు. తీరా చూస్తే రోడ్డున పడేశారు. నాయకుల్ని చేస్తారో లేదో కానీ ఉపాధి అయినా కల్పించమని వారు బతిమాలుకుంటున్నారు. వైసీపీకి పని చేయించుకున్న ఫలితంగా టీడీపీ ప్రభుత్వం కానీ టీడీపీ నేతలు కానీ వారిని దగ్గరకు తీసుకునే పరిస్థితి లేదు. వారి కోసం వైసీపీనే ఏదో ఒకటి చేయాలి. నెలకు పదివేలు ఇచ్చి పార్టీ పని అయినా చేయించుకోవాలని వారు కోరుతున్నారు. మరి వైసీపీ అధినేత జగన్ కు తీరుతుందా ?