మన ప్లేట్లో మన బిర్యానీ అని అశ పెట్టిన జగన్ రెడ్డి మాటలు నమ్మి నిండా మునిగింది వైసీపీ క్యాడర్. జగన్ రెడ్డి కోసం పదేళ్ల పాటు కిందా మీదా పడి పని చేసి.. ఖర్చు పెట్టుకున్న వారిలో పట్టుమని పది మందిని అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ రెడ్డి కలవలేదు. ఐదేళ్లలో వారి గురించి పట్టించుకున్నదీ లేదు. పైగా వారికేమాత్రం ప్రాధాన్యం లేకుండా వాలంటీర్లను, గృహసారధులను నియమించారు. ఎవరికైనా చిన్న చిన్న పనులు ఇచ్చి ఉంటే వాటికి బిల్లులు కూడా మంజూరు చేయలేదు. కానీ ఇప్పుడు మళ్లీ క్యాడర్ కు జగన్ రెడ్డి గుర్తుకు వచ్చారు.
వాలంటీర్లు ఉండగా క్యాడర్ ఎందుకు దండగ !
కష్టపడి అధికారంలోకి తీసుకు వచ్చిన క్యాడర్ ను ఏ పార్టీ అయినా నేత అయినా గుర్తు పెట్టుకుంటారు. వారు ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వ పరంగా సాయం చేస్తారు. ప్రజల్లో వారికి కొంత పలుకుబడి పెంచేలా అధికారం ఇస్తారు. కానీ జగన్ రెడ్డి సర్కార్ మాత్రం క్యాడర్ ను ఎప్పుడూ పట్టించుకోలేదు. అధికారంలోకి రావడంతో క్యాడర్ ను పూర్తిగా పక్కన పెట్టి వాలంటీర్లను నియమించుకున్నారు. మొత్తం వారి ద్వారానే రాజకీయాలు చేస్తున్నారు. చివరికి వైసీపీ నేతల మాటలకూ విలువ లేదు.
వాలంటీర్లనే లీడర్లు చేస్తానన్న జగన్ రెడ్డి
తమ పార్టీ క్యాడర్ ను ..లీడర్లను చేస్తామని జగన్ రెడ్డి నోటి వెంట ఎప్పుడూ రాలేదు. అసలు పట్టించుకోలేదు. కానీ వాలంటీర్లను మాత్రం లీడర్లను చేస్తానని.. భావి వైసీపీ నేతలు మీరేనని వారికి చెబుతూ వస్తున్నారు. ఈ పరిణామం చాలా మందిని ఆశ్చర్య పరిచింది. పార్టీ కోసం కష్టపడిన వారిని కాకుండా ఇలా వాలంటీర్లపై జగన్ రెడ్డి ఎక్కువ ప్రేమ చూపించడం… తమను పట్టించుకోకపోవడంతో … వారు కూడా పార్టీతో డిటాచ్ అయిపోయారు. సొంత పనులతో బిజీ అయిపోయారు. అందుకే బహిరంగసభలకు కూడా స్వచ్చందంగా వచ్చే జనాలు తగ్గిపోతున్నారు. పూర్తిగా డబ్బులిచ్చి తరలించుకునేవారి మీదనే ఆధారపడుతున్నారు.
కుర్చీ కిందకు నీళ్లొచ్చాయని ఇప్పుడు క్యాడర్ తో భేటీ !
మొత్తం తన వ్యవస్థలన్నీ ..తనను నిండా ముంచాయని జగన్ రెడ్డికి అర్థమయిందేమో కానీ క్యాడర్ తో భేటీ అంటూ హడావుడి చేస్తున్నారు. రెండున్నర వేల మందిని మంగళగిరి కన్వెషన్ హాల్‌కు పిలిపించుకుని మళ్లీ మన ప్లేట్లో.. మన బిర్యానీ కథలు చెప్పాలని డిసైడయ్యారు. అయితే.. మళ్లీ ఎన్నికలకు ముందే తాము గుర్తొచ్చామా అని ఎక్కువ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. తమకు ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న జగన్ రెడ్డి కోసం… మళ్లీ మనస్ఫూర్తిగా పని చేయడం కష్టమే.