ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి – ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ అయిన సంగతి తెలిసిందే. దీనిపై రకరకాల విశ్లేషణలు వచ్చేశాయి. ఏపీ రాజకీయ పక్షాలవారు ఈ భేటీని ఎవరి కోణం నుంచి చూస్తున్నారు. తన కేసుల నుంచి బయటపడేందుకే ప్రధాని కాళ్ల మీద జగన్ పడ్డారని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ప్రధాని ముందు మోకరిల్లినంత మాత్రాన అవినీతి కేసుల నుంచి జగన్ బయటకి రావడం సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక, వైకాపా వాదన రొటీన్. రాష్ట్ర సమస్యలపై చర్చించడానికే జగన్ ఢిల్లీకి వెళ్లారని చెబుతారు. అయితే, ఇంతకీ ఈ భేటీపై భాజపా కూడా స్పందించింది! అదే ఇప్పుడు చర్చనీయాంశం.
ప్రధానమంత్రిని జగన్ కలుసుకోవడాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని ఏపీ భాజపా వ్యవహారాల ఇన్ ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరినైనా కలుసుకునే అవకాశం ఉంటుందనీ, ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేత పీఎంను కలవడంలో తప్పేముందని సమర్థించుకున్నారు. జగన్ ఒక్కరే ప్రధానిని కలవలేదనీ, పార్లమెంటు సభ్యులు కూడా ఉన్నారు కదా అని సిద్ధార్థనాథ్ చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే… జగన్ కేసుల గురించి ఆయన మాట్లాడటం! మోడీని కలుసుకోవడానికీ, జగన్ కేసుల ఎలాంటి సంబంధం లేదన్నారు. జగన్ పై ఉన్న కేసుల గురించి కోర్టులు ఉన్నాయనీ, అవే చూసుకుంటున్నాయని ఆయన చెప్పారు.
ప్రాక్టికల్ గా ఆలోచిస్తే… జగన్ తో ప్రత్యేకంగా వైరం పెంచుకోవాల్సిన అవసరం భాజపాకి ఏముంది..? నిజానికి, గడచిన ఎన్నికల సమయంలోనే వైకాపాతో పొత్తు కోసం భాజపా ప్రయత్నించింది కూడా! అప్పుడు జగన్ వేవ్ ఆ రేంజిలో ఉన్నమాట వాస్తవమే కదా. అయితే, ఆ తరువాత టీడీపీతో పొత్తు కుదిరింది. ఆ తరువాత కూడా జగన్ విషయంలో భాజపా ప్రత్యేకంగా వ్యవహరించిన సందర్భాలు లేవు! ఉండాల్సిన అవసరం భాజపాకి ఏముంటుంది..? ఎందుకంటే, వైకాపా అనేది ఒక ప్రాంతీయ పార్టీ. తెలుగుదేశం ఎలానో ఇదీ అంతే!
పొలిటికల్ గా ఆలోచిస్తే… భవిష్యత్తులో ఎవరి అవసరాలు ఎవరితో ఉంటాయో ఎవరికి ఎరుక! ఇప్పుడు, ఏపీలో భాజపా పరిస్థితినే తీసుకుంటే… పార్టీ ఎదగకపోవడానికి చంద్రబాబు కారణమనే విషయం మోడీకి తెలియంది కాదు. అంతమాత్రాన టీడీపీకి కటీఫ్ చెప్పడం లేదు. భవిష్యత్తు అవసరాలు ఊహించలేరు కదా! ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి భాజపాకి ఎన్నటికీ రాదు అని చెప్పడం కష్టం. తెరాస విషయంలో కూడా భాజపా వైఖరి ఇలానే ఉంటోంది. కేసీఆర్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ప్రధాని బాగానే మాట్లాడుతుంటారు. రాజకీయంగా కూడా ఫ్రెండ్లీ వాతావరణమే కనిపిస్తుంది.
ఇదే క్రమంలో వైకాపా కూడా ఒక ప్రాంతీయ పార్టీ. సో.. అధికారంలో లేనంత మాత్రాన జగన్ విషయంలో ప్రత్యేకంగా స్పందించాల్సిన అవసరం భాజపాకి ఏముంటుంది..? టీడీపీతో పొత్తు ఉన్నంత మాత్రాన… టీడీపీకి వైకాపాతో రాజకీయ వైరం ఉన్నంత మాత్రాన.. అది భాజపాకీ ఉండాలన్న రూలేముంది..? భాజపా తన లెక్కల్లో తాను ఉంది!