వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలువబోతున్నారు. ప్రత్యేక హోదా, తదితర హామీల అమలుకోసం ఆయనకి వినతి పత్రం ఈయబోతున్నారు. ఆ తరువాత ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రుల అపాయింట్మెంట్ ఇస్తే వారినీ కలుస్తారు. డిల్లీలోని జాతీయపార్టీల నాయకులని కూడా కలిసి ప్రత్యేక హోదా తాము చేస్తున్న పోరాటానికి మద్దతు కోరుతారు. ఈరోజు లోక్ సభలో వైకాపా ఎంపిలు ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేశారు. ఏపికి ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ఇవ్వాలనుకొంటున్నట్లు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పినప్పుడు, ప్రత్యేక హోదాకి ప్రత్యమ్నాయంగా మరేది తమకి ఆమోదయోగ్యం కాదని వారు తేల్చి చెప్పారు.
మిత్రపక్షమైన తెదేపా ఎంపిలు, కాంగ్రెస్ పార్టీ ఎంపిలు ఎంతగా ఒత్తిడి చేస్తున్నా ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీని, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని స్వయంగా కలిసి ప్రత్యేక హోదా కోసం గట్టిగా ఒత్తిడి చేసినప్పటికీ వారు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ఇచ్చేందుకే ఆలోచిస్తున్నారు తప్ప హోదా ఇస్తామని లేదా కనీసం పరిశీలిస్తామని కూడా హామీ ఇవ్వడం లేదు. సీతారాం ఏచూరి, జైరాం రమేష్, గులాం నబీ ఆజాద్, ఇంకా వివిధ రాష్ట్రాలకి చెందిన ఎంపిలు అందరూ ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టినా కేంద్రప్రభుత్వం దిగిరాలేదు. ఇంతమంది సీనియర్ నేతలు, ఎంపిలు, భాజపాకి మిత్రపక్షంగా ఉన్న తెదేపా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒత్తిడి చేసినా ఫలితం లేనప్పుడు, జగన్మోహన్ రెడ్డి వెళ్లి అడిగినంత మాత్రన్న కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చేస్తుందని ఎవరూ ఆశించలేరు. ఆ సంగతి జగన్ కి కూడా తెలుసు. అయినా ఎందుకు వెళుతున్నారంటే, ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తి చూపించకపోయినా తను డిల్లీ వెళ్లి అందరినీ కలిసి ప్రత్యేక హోదా కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాని ప్రజలకి చెప్పుకోవడానికే కావచ్చు.