వైసీపీ అధినేత జగన్- సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య పూడ్చలేని గ్యాప్ ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ తీరుపై అసహనంగా ఉన్న బాలినేనిపై జగన్ కూడా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఒంగోలులో పార్టీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు..మీరు కల్పించుకొని బాలినేని శ్రీనివాసరెడ్డితో మాట్లాడండి అని జగన్ ను కోరితే ఆయన ఇచ్చిన సమాధానం విని ద్వితీయ శ్రేణి నాయకత్వం నోరెళ్ళ బెట్టాల్సి వచ్చింది.
వైసీపీ ఓటమి పాలయ్యాక నేతలంతా ఒక్కొక్కరు తమ దారి చూసుకుంటున్నారు. ఒంగోలు వైసీపీ లీడర్లు సైతం కూటమి పార్టీలో చేరిపోతున్నారు. జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న బాలినేని జిల్లాకు దూరంగా ఉండటంతో పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ఈ క్రమంలోనే ద్వితీయ శ్రేణి నాయకులు తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ ను కలిశారు.
ఒంగోలులో పార్టీ పరిస్థితిని జగన్ కు వివరించారు. బాలినేని శ్రీనివాసరెడ్డిని పిలిచి మాట్లాడాలని, లేదంటే పార్టీ మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. కానీ, ఆయన మాత్రం అందుకు సూచనప్రాయంగా అయినా అంగీకరించకుండా, ఆయనను ముందు హైదరాబాద్ నుంచి ఒంగోలు రమ్మనండి.. అక్కడ కూర్చుంటే ఏం లాభం అంటూ ద్వితీయ శ్రేణి నాయకుల వద్ద బాలినేనిపై అసహనం వ్యక్తం చేయడం స్థానిక నేతల్లో చర్చనీయాంశం అయింది.
హైదరాబాద్ వదిలి.. ఒంగోలు వచ్చి పార్టీకి అండగా ఉండాలని నేరుగా బాలినేనికే ఆదేశాలు ఇవ్వకుండా…తమ వద్ద వాసన్నపై జగన్ సీరియస్ కావడం ఎంటిని స్థానిక నేతలు అసహనం వ్యక్తం చేశారు.