ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని రద్దు చేయాలని జగన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం జగన్ ఏ క్షణమైనా ఢిల్లీ వెళ్లే అవకశం ఉంది. ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షాలతోనూ సమావేశం అవుతారని చెబుతున్నారు. జమిలీ ఎన్నికలు అంటూ వస్తే డిసెంబర్ లో ఎన్నికలు జరుగుతాయని ఎక్కువ మంది భావిస్తున్నారు. సీఎం జగన్ కూడా ఈ దిశగానే కసరత్తు చేసుకుంటున్నారని అంటున్నారు.
రాజ్యాంగం ప్రకారం ఈ నెల ఇరవయ్యే తేదీ లోపు అసెంబ్లీని సమావేశపర్చాల్సి ఉంది. ఆరేడు రోజుల పాటు అసెంబ్లీని సమావేశపర్చి .. వారం పాటు.. తాను చేసిన పనుల గురించి ప్రజెంటేషన్ ఇస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధి, సంక్షేమం మొత్తం ప్రజల ముందు పెడతారని అంటున్నారు. ఇది ఎన్నికలకు సన్నాహమేనని చెబుతున్నారు.
అయితే ముందస్తుకు వెళ్లాలంటే.. కేంద్రం సానుకూలత తప్పనిసరి. ఇప్పటికే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. కానీ ఎలా చూసినా ఏపీకి సంబంధించిన ప్రక్రియను అధికారికంగా ప్రారంభించలేరు. అసెంబ్లీ రద్దు అయిన తర్వాతనే ప్రారంభిస్తారు. కేంద్రం జమిలీ ఎన్నికలపై ఆలోచన చేస్తోంది. అదే ఆలోచన ఉంటే.. పార్లమెంట్ తో జరగాల్సిన రాష్ట్రం ఎన్నికలను ముందుకు జరిపేందుకు అంగీకరించదు. ఒక వేళ కేంద్రమే ముందుకు వస్తే జగన్ రెడ్డి వ్యతిరేకించే అవకాశం లేదు. మొత్తంగా కేంద్రం తీసుకునే నిర్ణయం మేరకే జగన్ రెడ్డి నిర్ణయం ఉంటుంది.