వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదం రిలయన్స్ వల్లేనంటూ.. రాష్ట్రం విడిపోక ముందు సాక్షి పత్రిక కొన్నాళ్ల కిందట ప్రచారం చేసింది. ఆ ప్రచారం జరిగిన వెంటనే… వైఎస్ జగన్‌కు అనుచరులుగా ఉన్న కొందరు.. రిలయన్స్ స్టోర్లపై దాడులు చేశారు. ఏ ఒక్క షాపునూ వదలకుండా.. విధ్వంసం జరగడంతో.. దేశవ్యాప్త కలకలం రేపింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం.. ఈ దాడులు చేశారన్న విషయం… వెంటనే క్లారిటీ వచ్చింది. ఆ కేసులు అలా ఉండిపోయాయి. అవి తీవ్రమైన నేరాలు. ఆ తర్వాత తునిలో.. రైలు దహనం, పోలీస్ స్టేషన్‌పై దాడి, పోలీసుల్ని కొట్టడం… వంటి తీవ్రమైన నేరాలు జరిగాయి. ఇప్పుడీ కేసులను ఎత్తివేయాలని.. జగన్ సర్కార్ భావిస్తోంది. అసలు ప్రభుత్వాలకు ఇలాంటి ఆలోచన వస్తుందా.. ఆని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. వచ్చింది. .. రిలయన్స్ పై దాడి కేసులు.. తుని దాడుల కేసులను ఎత్తి వేయాలన్న ఆలోచన.. ఏపీ సర్కార్ చేస్తోంది.ఈ ప్రతిపాదనను కేబినెట్లో చర్చించబోతున్నారు.
ప్రజాసంబంధమైన ఉద్యమాల్లో … నమోదైన కేసులను ప్రభుత్వాలు ఎత్తివేస్తామని హామీ ఇవ్వడం సహజం. సమైక్యాంధ్ర ఉద్యమం , ప్రత్యేకహోదా ఉద్యమాల్లాంటి వాటిలో కేసులను ఎత్తివేస్తూంటారు. కానీ.. దోపిడీలు, దొమ్మీలు, దాడులకు పాల్పడిన ఘటనల్లో కేసులు ఎత్తివేయడం అనేది.. ఇంత వరకూ ఏ ప్రభుత్వమూ చేయలేదు. మొదటి సారిగా ఏపీ సర్కార్ మాత్రమే.. అలాంటి ఆలోచన చేస్తోంది. ఈ రెండు ఘటనల్లోనూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు అనబడేవాళ్లే ఎక్కువగా కేసుల్లో ఇరుక్కుని ఉన్నందున.. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దాడులు, దహనాల కేసులను కూడా.. ప్రభుత్వాలు ఎత్తి వేస్తాయన్న భరోసా లభిస్తే.. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు వెనక్కి తిరిగి చూసుకోరు., తమ శక్తి మేర అరాచకాలకు పాల్పడతారు. ఇది తీవ్రమైన లా అండ్ ఆర్డర్ సమస్యకు దారి తీస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. జగన్మోహన్ రెడ్డి ప్రోద్భలంతోనే.. ఆ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు.. ఆయన కేసులు ఎత్తివేస్తే… వాటికి మరింత బలం చేకూరుతుందన్న విమర్శ వినిపిస్తోంది.