పాపం… నిజానికి సదరు వైకాపా ఎమ్మెల్యే ఉద్దేశం తమ పార్టీ అధినేతను ఇరుకున పెట్టడం ఎంతమాత్రమూ కాదు. ఆయన త్రికరణ శుద్ధిగా ప్రభుత్వాన్ని, పాలకపక్షాన్ని ఇరుకున పెట్టాలని మాత్రమే అనుకున్నారు. అయితే అధికార పక్షం పన్నిన వ్యూహంలో ఆయన పార్టీ అధినేత జగన్ చిక్కుకున్నారు. మాటల కోసం వెతుక్కుంటూ మడమ తిప్పేశారు. ఏతావతా జగన్ పరిస్థితి సూపులో పడ్డ ఎలుక మాదిరిగా తయారైతే.. సదరు ఎమ్మెల్యే మాత్రం గురువారం నాడు అసెంబ్లీలో హీరో అయిపోయారు. సోషల్ మీడియా మొత్తం ఆ ఎమ్మెల్యేను అతి భయంకరంగా కీర్తించడం కూడా ప్రారంభం అయిపోయింది.
ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా.. తమ తమ ఎమ్మెల్యేల జీతభత్యాలను అతి భయంకరమైన స్థాయిలో పెంచేసిన సంగతి అందరికీ తెలిసిందే. కనీసం ఆదాయపు పన్ను చెల్లించే అవసరం కూడా లేకుండా.. జీతాలు పెంచేసుకున్నారు. సహజంగానే ఈ ఒక్క విషయం మీద మాత్రం ప్రతిపక్షం కూడా పాలకపక్షం ప్రతిపాదనతో గొంతు కలిపి వారి మాటలకు జై కొట్టి.. జీతాలు పెంచడానికి సహకరించింది.
అయితే ఏపీ అసెంబ్లీలో ఈ విషయంపై చర్చ సందర్భంగా వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి మాత్రం ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజలకు మాత్రం మనం పొదుపు పాఠాలు చెబుతూ ఉంటాం.. మనం మాత్రం ఇలా జీతాలు పెంచుకుంటూ పోవడం ఏం కరెక్టు.. మనం ఏం చేస్తున్నామని… మనకు ఏం కష్టాలు ఉన్నాయని జీతాలు పెంచాలి.. అంటూ ప్రభుత్వ నిర్ణయంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ జీతాల పెంపుపై రెఫరెండం నిర్వహించాలని.. ఏ ఒక్క నియోజకవర్గంలో ప్రజాభిప్రాయం దీనికి అనుకూలంగా వచ్చినా.. తాను తక్షణం రాజకీయాలను వదలి వెళ్లిపోతానని శ్రీధరరెడ్డి సభలో సవాలు విసిరారు.
ఈలోగా యనమల లేచి.. ఇదంతా బాగానే ఉంది.. ఇంతకూ మీ పార్టీ విధానం ఏమిటి..? మీ అధినేతను చెప్పమనండి.. అంటూ నిలదీశారు. జగన్ లేచి దీనికి సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడిపోయారు. జీతాల పెంపు వ్యవహారం … వద్దనలేరు! అలా అంటే.. పార్టీ ఎమ్మెల్యేలంతా తననే తిట్టిపోసే (లోలోన అయినాసరే) అవకాశంఉంది. అందుకే ఆయన కర్ర విరగకుండా పాము చావకుండా.. దీనికి సంబంధించి వేసిన కమిటీలో మా పార్టీ వాళ్లు కూడా ఉన్నారు గనుక.. వద్దని నేను చెప్పలేను. కాకపోతే.. ఇంత భారీగా పెంచకుండా కొంచెం తగ్గిస్తే బాగుంటుంది.. అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. జగన్ మాటల్ని పట్టించుకోకుండానే.. బిల్లు పాసయిపోయింది. మొత్తానికి జగన్ను ఇరుకున పెడితే పెట్టాడు గానీ… తమ వేతనాలు పెంపును వ్యతిరేకించిన ఏకైక ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధరరెడ్డి సాధారణ ప్రజల దృష్టిలో హీరో అయిపోయాడు.
కోటంరెడ్డి అభినందనీయుడే ఎందుకంటే…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి నిజంగానే ఎంతో అభినందనీనయుడు. ఇవాళ అసెంబ్లీలో జీతాల పెంపును వ్యతిరేకించినందుకు, దాని వివరణ ఇచ్చిన తీరుకు ఆయనకు సోషల్ మీడియాలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఆయనను కీర్తించడానికి కారణం ఇదొక్కటే కానవసరం లేదు. ఆయన తొలినుంచి ఎమ్మెల్యేగా జీతాన్ని తీసుకోవడం లేదు. తనకు వచ్చే వేతనాన్ని తన నియోజకవర్గంలో పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు తదితర రూపేణా ఆర్థిక సహాయం చేయడానికి ఆయన కేటాయించేశారు. ఎన్నడూ ఎమ్మెల్యేగా అంతే జీతాలు, కానుకల కోసం కక్కుర్తి పడిన అలవాటు ఆయనకు లేదు. తన జీవితాన్ని, తన ఖర్చులను తన సంపాదనలోంచే ప్లాన్ చేసుకుంటూ… తనను ఎన్నుకున్నందుకు ప్రజాజీవితాన్ని విడిగా నిస్వార్థంగా గడపాలనే విలువలను ఆయన పాటిస్తుంటారు. అందుకే ఆయన ఎప్పటికీ అభినందనీయులు.