ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారం లేనప్పుడు.. తన తండ్రి సీఎంగా ఉన్నప్పుడే భారీగా అవినీతికి పాల్పడ్డారని కేసులు నమోదయ్యాయి. ఇక సీఎం అయితే పరిస్థితి ఏమిటనేది చాలా మంది అనుకున్నమాట. ఇప్పుడు ఆ మాటలను నిజం చేస్తూ అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక, మద్యం మొత్తం ఆయన గుప్పిట్లోఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓన్లీ క్యాష్ లావాదేవీలు చేస్తూ… బ్లాక్ మనీ పోగేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు సరికొత్తగా అనంతపురం జిల్లాలో లేపాక్షి భూములను మళ్లీ కొట్టేశారన్న ఆరోపణలు ఊపందుకుంటున్నాయి.
నెవర్ బిఫోర్.. నెవర్ ఆఫ్టర్ స్కాం !
అనంతపురం జిల్లాలేపాక్షి భూముల వ్యవహారంలో జరుగుతున్నది చూస్తే ఇలా కూడా చేయవచ్చా అన్న ఆశ్చర్యపోవడం స్కామ్ స్టర్లకు సైతం తప్పదు. వైఎస్ హయాంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో వేల ఎకరాల భూముల్ని ఇందు ప్రాజెక్ట్స్‌కు.. ఎకరం రూ. యాభై వేలకు చొప్పున కేటాయించారు. వాటిలో ఏ మాత్రం పరిశ్రమలు.. ప్రాజెక్టులు.. పెట్టని ఇందూ ప్రాజెక్టులు భూముల్ని తనఖా పెట్టి వేల కోట్ల రుణాలు తెచ్చుకుని దారి మళ్లించి వాడేసుకుంది. వాటిలో కొన్ని జగన్ సంస్థల్లోకి పెట్టుబడులుగా మళ్లించిందని సీబీఐ కేసులు పెట్టింది. ఈడీ ఆ ఆస్తులను ఆటాచ్ చేసింది. ఇదే సందనుకుని ఇందు ప్రాజెక్ట్స్ రుణాలు కట్టలేమని చెప్పేసింది. దీంతో దివాలాకు బ్యాంకులు అంగీకరించాయి. ఓ కంపెనీ వచ్చి తాము రూ. ఐదు వందల కోట్లిస్తాం.. ఇందు ఆస్తులన్నీ ఇచ్చేయండి అంటే బ్యాంకులు ఒప్పుకున్నాయి. దీంతో రూ. ఐదు వందల కోట్లిచ్చి… ఇందు పేరు మీద ఉన్న వేల ఎకరాల భూముల్ని ఆ కంపెనీ తీసుకోబోతోందన్నమాట.
ఒక్క భూమి.. రెండు సార్లు స్కాంలు.. !
ఒక్క భూమిపై రెండు సార్లు స్కాంలు చేయడం అంటే మామూలు తెలివి తేటలు కాదు. భూముల్ని తీసుకుని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ..వేల కోట్లుతీసుకుని మళ్లీ ఆ భూముల్ని ఆ తాకట్టు పెట్టిన బ్యాంకుల దగ్గర చాలా తక్కువకు కొట్టేయడం .. అందుకు బ్యాంకులు కూడా అంగీకరించడం అన్నది ఊహకు అందని విషయం. నిజానికి ఆ కేటాయింపుల్ని ప్రభుత్వం ఎప్పుడో రద్దు చేసింది. ఈడీ అటాచ్‌లో ఉన్నాయి. అలాంటప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి.. భూముల్ని కాపాడేందుకు ప్రయత్నించాలి. తాము కేటాయింపులు రద్దు చేశామని చెప్పాలి. కానీ ఇక్కడ ఉన్న వారికే ఆ భూములు దఖలు పడతాయి కాబట్టి. .. సైలెంట్‌గా ఉండిపోయారు.
బ్యాంకులు కూడా ఇంత దివాలా తీసేశాయా !?
ఇందు ప్రాజెక్ట్స్ భూములపై రూ. ఐదు వేల కోట్ల వరకూ అప్పులిచ్చిన బ్యాంకులు… దివాలా ప్రక్రియలో రూ. ఐదు వందల కోట్లిస్తే చాలని ఎందుకు అంగీకరించాయనేది ఈ డబుల్ స్కాంలో కీలకంగా మారింది. ఎందుకంటే.. నిజంగా వాటిని వేలం వేసుకుంటే ఆ బ్యాంకులకు వడ్డీతో సహా తాము అప్పు ఇచ్చిన మొత్తం రికవర్ అవుతుంది. కానీ ఆ బ్యాంకులు వేలం వేయకుండా.. రూ. ఐదువందల కోట్లిస్తామని వచ్చిన కంపెనీకే కట్టుబడెతున్నాయి. ఇన్స్టాల్మెంట్లు తీసుకుంటున్నాయి.
ఆ భూములన్నీ జగన్ సన్నిహితుల సూట్ కేసు కంపెనీలకే !?
ఎర్తిన్ ప్రాజెక్ట్స్ అనే సంస్థ ఇందు ఆస్తులన్నీ తీసుకుంటోంది. ఆ సంస్థలో ఇటీవలే జగన్ మేనమామ.. రవీంధ్రనాథ్ రెడ్డి కుమారుడు డైరక్టర్‌గా చేరాడు. ఈ కంపెనీకి డబ్బులు సమకూరుస్తోంది అరబిందో సంస్థ. ఇది జగన్‌కు ఎంత సన్నిహితమంటే.. ఏపీలో పోర్టలు..సెజ్‌లు దక్కించుకుంది. అందరూ కలిసి గూడుపుఠాణి చేసి ప్రజా ఆస్తులైన లేపాక్షి వేల ఎకరాల్ని ఫలహారం చేస్తున్నారన్న ఆరోపణలు అందుకే వస్తున్నాయి.