న్యాయరాజధాని కర్నూలుకు ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వచ్చింది. కర్నూలుకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓర్వకల్లులో రూ.150 కోట్లు పెట్టి నిర్మించిన విమానాశ్రయాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ప్రత్యేక విమానంలో ఆ ఎయిర్‌పోర్టులోనే దిగిన సీఎం జగన్… న్యాయరాజధానికి మొదటి హంగు సమకూరిందని… అన్ని ప్రాంతాల నుంచి కనెక్టివిటి పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ఓర్వకల్లు ఎయిర్ పోర్టు నుంచి ఈ నెల 28వ తేదీ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ ఎయిర్‌పోర్టును ప్రారంభించడం రెండో సారి. సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు ఈ ఎయిర్‌పోర్టును ప్రారంభించారు.
ఆయన కూడా ప్రత్యేక విమానంలో కర్నూలు ఎయిర్ పోర్టులోనే .. కొత్తగా నిర్మించిన రన్ వేపైనే ల్యాండయ్యారు. ప్యాచ్ వర్క్ పనులు చేస్తున్నారు. కమర్షియల్ ఆపరేషన్స్ పై.. కేంద్రంతో .. విమానయాన సంస్థలతో చర్చలు జరిపారు. ఈ లోపు ప్రభుత్వం మారింది. ఓర్వకల్లు సమీపంలో అప్పటి ప్రభుత్వం పలు పరిశ్రమలకు భూములు కేటాయించింది. తంగడంచ వద్ద మెగా సీడ్ పార్క్‌ను ఏర్పాటు చేసింది. అయితే జగన్ సర్కార్ వచ్చిన తర్వాత మొత్తం రద్దు చేసేసింది. దాంతో కర్నూలుకు పెట్టుబడులు పెట్టేవారు రాకపోకలు తగ్గిపోయాయి.
ప్రభుత్వం కూడా చాలా రోజుల పాటు ఎయిర్ పోర్టును పట్టించుకోలేదు. ఎట్టకేలకు… ప్రభుత్వం ఎయిర్ పోర్టును ప్రారంభించాలని నిర్ణయించి ప్రయత్నాలు చేయడంతో ఇప్పటికి కుదిరింది. ఈ నెల 28 నుంచి బెంగుళూరు, విశాఖ, చెన్నైకి విమాన సర్వీస్‌లు ప్రారంభించేందుకు ఇండిగో సంస్థ అంగీకరించింది. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్లుగా సీఎం జగన్ ప్రకటించారు. అయితే ఎయిర్ పోర్టు ముందు మాత్రం వైఎస్ విగ్రహాన్ని పెట్టారు.