చెల్లికి మళ్లీ పెళ్లి అని ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం శంకుస్థాపనలు చేసిన వాటికి కొత్త సీఎం జగన్ మళ్లీ మళ్లీ శంకుస్థాపనలు చేస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో రామయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేస్తున్నారు. నిజానికి మూడున్నరేళ్ల కిందటే సీఎం శంకుస్థాపన చేశారు. ఆ పనులు కొనసాగించి ఉంటే ఈ పాటికి ఓ రూపు వచ్చేది. కానీ ఆపేశారు. ఇప్పుడు జగన్ శంకుస్థాపన చేస్తున్నారు. కడతారా లేదా అన్నది ఊహించడం పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే.. ఈ మూడేళ్ల కాలంలో జగన్ రివర్స్ శంకుస్థాపనలు చేసిన వాటిని కాస్త రివైండ్ చేసుకుంటేక్లారిటీ వచ్చేస్తుంది.
చిన్న చిన్న వాటి గురించి పక్కన పెడితే.. కాస్త పెద్దవాటి గురించి చెప్పుకుందాం. మొదట సీఎం కాగానే చంద్రబాబు శంకుస్థాపన చేసిన కడప స్టీల్ ఫ్యాక్టరీని పక్కన పెట్టేసి.. ప్లేస్ మార్చి తాను శంకుస్థాపన చేశారు. మూడేళ్లు అయింది. ఇప్పటికీ ఆ స్టీల్ ప్లాంట్ గతేంతో తెలియదు. నిజానికి ఏడాదిన్నరలో తొలి విడత పూర్తవుతుందని చెప్పారు. ఆ తర్వాత మెడికల్ కాలేజీలకు శంకుస్థాపనలు చేశారు. కానీ ఒక్కటీ ముందడుగు పడలేదు. కృష్ణాజిల్లాలో వేదాద్రి ప్రాజెక్టుకు రీ శంకుస్థాపన చేశారు. అదీ కాస్త పని జరిగిన తర్వాత డబ్బులివ్వలేదని కాంట్రాక్టర్ పారిపోయాడు.
అన్నింటి కంటే ముఖ్యం.. సీఎం కాగానే ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం గత ప్రభుత్వం నిర్మాణం ప్రారంభించిన ఆస్పత్రికి ఇచ్చాపురంలో మళ్లీ శంకుస్థాపన చేశారు, మూడేళ్లు గడిచినా అది ఇంకా పునాదుల దశలోనే ఉంది. బిల్లుల కోసం కాంట్రాక్టర్ చూస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే.. సీఎం శంకుస్థాపన చేసిన ఒక్క దానికీ కనీస పనులు జరగలేదు. చివరికి పులివెందుల బస్టాండ్‌కు కూడా ! అయితే ఈ శంకుస్థాపనల పేరుతో సాక్షి మీడియాకు వందల కోట్ల విలువైన ప్రజాధనం మాత్రం దోచి పెట్టారు. రామాయపట్నం విషయంలోనూ అదే జరుగుతోంది.