పరిస్థితులు బాగో లేనప్పుడే నోటి వెంట ఓటమి మాటలు వస్తాయి. మేము లేకపోతే ప్రజలు అన్నం తినలేరన్నట్లుగా మాట్లాడేస్తూ ఉంటారు. తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్ అదే చెప్పారు. తమ పార్టీ అధికారంలో లేకపోతే ఏదో జరిగిపోతుందని చివరి ప్రయత్నంగా ప్రజల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు లీడర్ల కన్నా తెలివైన వాళ్లు. మీరు లేనప్పుడు ప్రపంచం గడిచింది.. మీరు లేకపోయినా ఏమీ కాదని నిరూపించేందుకు పక్కన పెట్టేశారు. ఇప్పుడు తెలంగాణలో అంతకు మించిన పాలన జరుగుతోంది. దావోస్ లో కేటీఆర్ ఒక్క ఏడాదిలో తెచ్చిన దాని కన్నా డబుల్ పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నారు. ఇప్పుడు జగన్ రెడ్డి నోటి వెంట కూడా అదే మాటలు వస్తున్నాయి.
తాను చెప్పినవన్నీ చేశానని ఇప్పుడు దిగిపొమ్మన్నా దిగిపోతానని ఆయన రాజ్ దీప్ సర్దేశాయ్ కు చెప్పుకొచ్చారు. నాలుగున్నర కోట్ల వరకూ స్సాన్సర్ షిప్ ఇప్పించి ఏపీలో పెట్టించుకున్న కాంక్లేవ్ లో అసలు విషయాల కన్నా జగన్ రెడ్డి తన రాజకీయ వ్యూహాలను వెల్లడించడానికి ప్రాధాన్యం ఇచ్చారు. జగన్ రెడ్డి తాను ఐదేళ్లలో ఏ చేశాడో ఒక్కటీ చెప్పలేదు.. కానీ ఏదో చేసినట్లుగా గొప్పగా ఉందన్నారు. ఆయన బటన్ నొక్కడ తప్ప ఏమీ చేయలేదు. అప్పులు చేయడం.. సగం దిగమింగడం.. సగం బటన్లు నొక్కడం.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చడం తప్ప ఏమీ చేయలేదు. ఇప్పుడు తాను ఓడిపోయినా తనకు సంతోషమే అంటున్నారు.
దేవుడిచ్చిన పదవి అని ఆయనే ఇస్తాడని ఆయన పూర్తిగా మరో రకమైన ఆలోచనల్లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారు. అభ్యర్థులుగా ఎవర్ని పెడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. కలగాపులగం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మిగతా నేతలు కూడా వేరే దారి చూసుకునేలా జగన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి.