తిరుపతి లోక్ సభ నియోజకవర్గం ఉపఎన్నికను వైసీపీ అధినేత జగన్ కూడా సీరియ్గా తీసుకున్నారు. దేశం మొత్తం తిరుపతి వైపు తిరిగి చూసేలా గెలవాలని సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు. ఏడు నియోజకవర్గాలకు ఏడుగురు మంత్రుల్ని ఇంచార్జులుగా పెట్టారు. ఆ ఏడుగురుకి తోడుగా ఏడుగురు ఎమ్మెల్యేల్ని ఇచ్చారు. దిశానిర్దేశం చేసి… తిరుపతికి పంపించారు. తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో వైసీపీకి తిరుగులేని బలం ఉంది. ఏడుగురు ఎమ్మెల్యేలతో పాటు పంచాయతీలు… మున్సిపాలిటీలు అన్నీ ఆ పార్టీ చేతుల్లోనే ఉన్నాయి. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజాక్షేత్రంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రతి గడప గడపను సందర్శించాలని జగన్ దిశానిర్దేశం చేశారు.
వైసీపీ తరపున జగన్ ప్రచారంచేసే అవకాశం లేదని చెబుతున్నారు. టీడీపీ ఇప్పటికే చాలా ముందుగానే అభ్యర్థిని ఖరారు చేసింది. ఈ నెల 24వ తేదీన పనబాక లక్ష్మి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఒక్కో నియోజకవర్గంలో 25 వేల మందికి ఒక క్లస్టర్ ను ఏర్పాటు చేసి అక్కడ పార్టీ కార్యాలయాలను ప్రారంభించాలని చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. స్వయంగా చంద్రబాబు కూడా ప్రచార బరిలోకి దిగుతున్నారు. ఐదుగురితో కమిటీ కూడా ఏర్పాటు చేశారు. బీజేపీ .. మొదట్లో హడావుడి చేసిన బీజేపీ ఇప్పుడు సైలెంటయింది. అభ్యర్థిని ఖరారు చేయడానికి ఆలోచిస్తోంది.
మొత్తానికి అన్ని రాజకీయ పార్టీలు చాలా సీరియస్గా తిరుపతి ఉపఎన్నికను తీసుకోనున్నాయి. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో వైసీపీ గెలుపు నల్లేరు మీద నడక లా సాగుతుందని భావిస్తున్నా…రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయడం కష్టమనే అంచనా ఉంది. రాజకీయ పార్టీలన్నీ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగిన తర్వాత రాజకీయం మారే చాన్స్ కనిపిస్తోంది.