కోవిడ్ వచ్చి పోయింది.. చచ్చినోళ్ల ఖర్మ.. బతికున్న వాళ్లందర్నీ జగన్ రెడ్డి కాపాడుకున్నారని ప్రచారం చేశారు. ఇక వరదలు, విపత్తులు వచ్చినప్పుడు అంతే. బతికున్నోళ్లంతా జగన్ రెడ్డి ప్యాలెస్ లో నుంచి కాలు కదపకుండా ఇచ్చిన ఆదేశాల వల్లే బతికారని.. చచ్చిపోయిన వాళ్లు… ఆస్తులు పోగొట్టుకున్న వాళ్లు ఏదో పాపం చేసి ఉంటారన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అన్నీ విషయాల్లోనూ అదే పాలన. ఇప్పుడు కరెంట్ విషయంలోనూ అంతే.
వర్షాకాలంలోనూ కరెంట్ ఇవ్వలేని పాలన
వర్షాలు విపరీతంగా వచ్చేస్తాయి… కరెంట్ సమస్య రాదని బొగ్గు కొనకుండా.. తడిగుడ్డేసి కూర్చున్నారు. ఇప్పుడు వర్షాల కొరత ఉంది. వాతావరణం మారిపోయింది. కరెంట్ వినియోగం ఊహించనంత పెరిగిపోయింది. కానీ కరెంట్ ఉత్పత్తి లేదు. బయట నుంచి కొంటున్నా సరిపోనంత విద్యుత్ కొరత ఏర్పడింది. లోడ్ రిలీఫ్ పేరుతో నిన్నటి దాకా గ్రామాలకు కోతలేసిన జగన్ రెడ్డి సర్కార్ ఇప్పుడు పరిశ్రమలకూ అదే పని చేయాలని నిర్ణయించుకుంది. దీనంతటికి కారణం బొగ్గును సమకూర్చుకోలేకపోవడం.
ప్రతీ చోటా బొగ్గు లోటే !
ఒక్క విజయవాడ సర్కిల్ పరిధిలోనే 90 నుంచి 110 మెగావాట్ల విద్యుత్ లోటు ఏర్పడుతోంది. విజయవాడ డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రంలో సుమారు 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కావల్సి ఉండగా బొగ్గు కొరత కారణంగా సగానికి సగం ఉత్పత్తి పడిపోయి 1072 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. అలాగే రాయలసీమ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 1650 మెగావాట్ల సామర్థ్యానికిగాను 1061 మెగావాట్లు, కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్లో 2400 మెగావాట్లకుగాను 1008 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే అవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంంలోని అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు నిండుకున్నాయి.
విద్యుత్ చార్జీలు రెట్టింపు – కానీ ప్రజలకు వాతలు ! ఇదేం ఖర్మ !
వినియోగం పెరగడం, ఉత్పత్తి తగ్గడం, ఈ వ్యత్యాసాన్ని అంచనా వేసి భర్తీ చర్యలు చేపట్టాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తూ, అప్రకటిత కోతలు విధిస్తుండటంతో వినియోగదారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. సమయంతో నిమిత్తం లేకుండా ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో ఎడాపెడా కోతలు విధిస్తుండటంతో ఎప్పుడు కరెంట్ వస్తుందో, పోతుందో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ట్రూ అప్ చార్జీలు, ముడిసరుకు ధరలు, కస్టమర్ చార్జీల పేరిట పెద్దమొత్తాల్లో వసూలు చేస్తూ, వినియోగానికి తగ్గ విద్యుత్ సరఫరా చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.