ఏపీ సీఎం జగన్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఓ సినిమాలో చెప్పినట్లుగా మొదటి మూడేళ్లు చేయాల్సిదంతా చేసి చివరి రెండేళ్లు మాత్రం ప్రజలను పట్టించుకోవాలన్నట్లుగా ఇప్పుడు ఆయన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. పార్టీలో అన్ని వ్యవస్థలను సిద్ధం చేసి.. వారితో ఇంటింటికి వైసీపీని పంపించే ప్రయత్నంలో ఉన్నారు. ఇరవై ఏడో తేదీన కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షులు, ఇంచార్జులు, కోఆర్డినేటర్లతో పాటు పార్టీవ్యవస్థలతో జగన్ సమావేశమైన దిశానిర్దేశం చేస్తారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశారనిర్దేశం చేశారు.
అయితే ప్రభుత్వం చెప్పినట్లుగా ప్రజలందరికీ.. పథకాలు అందుతూ ఉంటే.. కొత్తగా వారికి పథకాల గురించి చెప్పాల్సిన అవసరం ఏముందని.. వారే సంతృప్తిగా ఉంటే.. ఈ ప్రచారం ఎందుకన్న అనుమానం సహజంగానే వస్తోంది. కానీ పథకాల వల్ల ఎవరికీ లాభం కలిగిందో కానీ.. అందరూ బాగుపడిపోయారన్న ఓ అభిప్రాయాన్ని కల్పించక తప్పదన్న అభిప్రాయం మాత్రం వైసీపీలో ఏర్పడింది. పథకాలవల్ల ఎంత పాజిటివిటీ వచ్చిందో అంచనా వేయడంలో వైసీపీ కూడా ఫెయిలవుతోంది. ఓ వైపు ప్రజల రోజువారీ ఆదాయంలో ప్రభుత్వం చాలా వురకూ వివిధ పన్నుల రూపంలో లాగేసుకుంటోందనే అభిప్రాయం బలపడింది. తమ డబ్బును వసూలు చేసి.. అందులో కొంత తమకు ఇస్తున్నారని వారు ఆగ్రహంతో ఉన్నారు.
ఇక అనర్హుల పేరుతో ఏ పథకమూ అందని వారు.. ఓ పథకం అందిందని ఇతర పథకాల్ని పొందని వారిలోనూ అసంతృప్తి ఉంది. ఇక వైసీపీ నేతల అరాచకాలపై ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో ఇంటింటికి తిరిగి వైసీపీ చేసిన మేలును చెప్పాలని జగన్ పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేయబోతున్నారు. అయితే పార్టీ క్యాడర్ కే చాలా వరకూ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.. వారెంత వరకూ చురుగ్గా కదులుతారనే సందేహం ఉంది. అదే సమయంలో భారం తగ్గించుకోవడానికి ఓటు బ్యాంక్‌కు మాత్రమే పథకాలు అమలు చేస్తున్న తీరు.. గ్రామాల్లో ఇప్పటికే అనేక మందిని వ్యతిరేకం చేసింది.
రెండేళ్ల ముందు నుంచే ప్రచారం ప్రారంభించాలని జగన్ నిర్ణయించారు. ఎన్నికలు సమయానికే జరుగుతాయా.. ముందుగా జరుగుతాయా అన్న విషయాన్ని పక్కన పెడితే వైసీపీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.