గత ఏడాది పాతవి, కొత్తవి అన్నింటికీ రంగులు మార్చేసి.. 108 వాహనాలతో విజయవాడ బెంజ్ సర్కిల్లో ప్రభుత్వం చేసిన హడావుడి గుర్తుంది కదా..!. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం మరో షోకి రెడీ అవుతోంది. ఇరవై ఒకటో తేదీన బెంజ్ సర్కిల్లో మరోసారి వందల వాహనాలు కొలువు దీరబోతున్నాయి. అయితే ఈ సారి 108 వాహనాలు కాదు. బియ్యం డోర్ డెలివరీ వాహనాలు. ఇంటికే ప్రభుత్వ పథకాలు చేర్చాలన్న లక్ష్యంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లను పెట్టి.. పించన్లను పంపిణీ చేయిస్తున్నారు. కానీ రేషన్ బియ్యాన్ని ఎలా డోర్ డెలివరీ చేయించారో అర్థంకాక మేధోమథనం జరిపి..చివరకి ఆటో కాన్సెప్ట్ కు అంగీకరించారు. దాని ప్రకారం.. పెద్ద ఎత్తున అంటే.. దాదాపుగా ఎనిమిది వేల వాహనాల్ని కొనుగోలు చేశారు.
డోర్ డెలివరీ చేయడానికి ప్రత్యేకంగా కొంత మందిని ఎంపిక చేసి.. వారికి వాహనాలను అప్పు కింద ఇప్పించారు. ప్రభుత్వం కొంత సబ్సిడీ ఇస్తుంది. బియ్యం డోర్ డెలివరీ చేసినందుకు ప్రభుత్వం కమిషన్ ఇస్తుంది. వాలంటీర్లు ఈ పనులు చేయడంలేదు. దీని కోసం విడిగా నియామకాలు చేపట్టారు. ఈ వాహనాలను అలా… వారి చేతుల్లోకి వెళ్లేలా చేయగలిగారు. ఇప్పటికి ఎనిమిది వేల వాహనాలు గుజరాత్ నుంచి రాష్ట్రానికి చేరుకున్నాయి. వచ్చే నెల నుంచి రేషన్ బియ్యం డోర్ డెలివరీ చేయాలి కాబట్టి… వాహనాలను ప్రారంభించబోతున్నారు. అన్ని వాహనాలను.. బెంజ్ సర్కిల్‌కు తీసుకు వచ్చి.. ముఖ్యమంత్రి జగన్ జెండా ఊపబోతున్నారు. అక్కడ్నుంచి ఆ వాహనాలన్నీ తమకు కేటాయించిన ప్రాంతాలకు వెళ్తాయి.
సన్నబియ్యం డోర్ డెలివరీ చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల. కానీ సన్నబియ్యం సాధ్యం కాదని తెలియడంతో… ఆ పేరును నాణ్యమైన బియ్యంగా మార్చుకున్నారు. అయితే ఇప్పుడు నాణ్యమైన బియ్యం ఇస్తున్నామా లేదా అన్నదాని సంగతి కూడా పక్కన పెట్టేసి.. డోర్ డెలివరీ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. గతంలో గోతాల్లో ప్యాకింగ్ చేసి ఇవ్వాలనుకున్నారు. కానీ ఆ గోతాల ఖర్చే తడిసి మోపెడవుతూండటంతో… ఒక్కసారి మాత్రమే గోతాలిచ్చి.. డోర్ డెలివరీ సమయంలో… ఆ గోతాల్లో బియ్యం పోయాలని నిర్ణయించుకున్నారు. వాహనాల షో తర్వాత… ఫిబ్రవరి ఒకటి నుంచి రేషన్ బియ్యం ఇంటింటికి సరఫరా చేయనున్నారు.