అధికారం చేపట్టి మూడున్నరేళ్లవుతోంది. కానీ ఇప్పటి వరకూ సీఎం జగన్ నేరుగా జనాన్ని కలిసింది లేదు. జనం సంగతి దెవుడెరుగు ..కనీసం ఎమ్మెల్యేలను కలిసే ఓపిక కూడా లేదు. అధికారం కోసం పాదయాత్ర చేసి అధికారం అందిన తర్వాత పూర్తి స్థాయిలో రిలాక్స్ అవుతున్న వ్యవహారం కూడా ప్రజల్లో చర్చనీయాంశం అవుతోంది. అయితే ఇంతే పూర్తిగా ప్యాలెస్‌కు పరిమితమై.. ఎన్నికలకు వెళ్తే ప్రజల్లో తేడా అభిప్రాయం ఏర్పడుతుందన్న కారణంగా ఆయన ఇప్పుడు మనసు మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. ప్రజల్లోకి వెళ్లకపోయినా వారికి కలిసేందుకు నిర్ణయించారు.
త్వరలో ప్రజాదర్భార్‌ను ప్రారంభించాలని జగన్ భావిస్తున్నారు. ఓ పూట ప్రజల్ని.. ఆ తర్వాత మరికొంత సమయం ఎమ్మెల్యేల్ని కలవాలని అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన ప్లాన్ రెడీ అవుతోంది. అయితే ఇదేమీ కొత్త ఐడియా కాదు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదికను కూల్చేశారు. ఆ తర్వాత ప్రజాదర్భార్ చేపట్టాలని నిర్ణయించారు. క్యాంప్ ఆఫీస్ దగ్గర ఓ షెడ్ నిర్మించారు. కానీ ఇంత వరకూ ప్రజాదర్భార్ ప్రారంభం కాలేదు. కొత్తలో ఫలానా తేదీ నుంచి ప్రజాదర్భార్ ఉంటుందని ప్రకటించారు. ఆ రోజున చాలా మంది ప్రజలు బాధలు చెప్పుకుందామని వచ్చారు. కానీ వాయిదా పడింది. అలా వాయిదా పడింది.. ఇప్పటి వరకూ ప్రారంభం కాలేదు.
మరో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో జగన్ జిల్లాల పర్యటనలు చేయాలని అనుకుంటున్నారు. అయితే తాను పథకాల మీట నొక్కడానికి వెళ్తున్నది జిల్లాలకే కదా అన్న అభిప్రాయంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే నేరుగా ప్రజలే తన వద్దకు వచ్చి కలిసే ఏర్పాట్లు చేయాలని చూస్తున్నారు. గతంలో వైఎస్ ప్రజల కోసం దర్బార్ నిర్వహించేవారు. ఇప్పుడు కూడా అదే మొదలు పెట్టాలని భావిస్తున్నారు. ఏదో విధంగా అందరికీ దూరంగా లేనని.. దగ్గరగా ఉన్నానని చెప్పుకోకపోతే.. ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో వైసీపీ వర్గాలు ఇలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.