ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె.ఈ.కృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ, “తెలంగాణా ప్రాజెక్టులని నిజంగా వ్యతిరేకిస్తున్నట్లయితే కర్నూలులో దీక్ష చేయడం కాదు. హైదరాబాద్ వెళ్లి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి ముందు చేస్తే ఏమయినా ప్రయోజనం ఉంటుంది. లేదా డిల్లీ వెళ్లి జలసంఘం కార్యాలయం ముందు చేసినా బాగుంటుంది. కానీ కర్నూలులో దీక్ష చేయడం కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించే చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది,” అని విమర్శించారు. తెదేపా నేతలు, మంత్రులు చాలా మంది అదే అభిప్రాయం వ్యక్తం చేసారు. వారి విమర్శలకి జగన్మోహన్ రెడ్డి బదులివ్వలేదు కానీ వైకాపా ప్రధాన కార్యదర్శి భూషణం బదులిచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు దాని వలన మేలు కలుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి తప్పకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి ముందు దీక్ష చేస్తారు. అవసరమయితే డిల్లీలో దీక్ష చేయడానికి కూడా ఆయన సిద్దమే,” అని అన్నారు.
ఆయన మాటలకి జగన్ ఆమోదం ఉందో తెలియదు కానీ ఆయన ఆ ప్రకటనకి చివర “కేసీఆర్ ఇంటి ముందు దీక్ష చేస్తే ఆంధ్రా ప్రజలకి లాభం కలుగుతుందంటే” అనే చిన్న మెలిక పెట్టారు కనుక అటువంటి ఆలోచన, ప్రయత్నం చేయరని భావించవచ్చు. కానీ ఆంధ్రా ప్రయోజనాలను కాపాడటానికే ఆయన ఈ దీక్ష చేస్తున్నానని చెప్పుకొంటున్నప్పుడు, మళ్ళీ కేసీఆర్ ఇంటి ముందు జగన్ దీక్ష చేయడం వలన ప్రయోజనం ఉంటే అనే అనుమానం ఎందుకో? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిజంగానే కేసీఆర్ ఇంటి ముందు దీక్ష చేయదలిస్తే, తెరాస నుంచి చాలా తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవలసి రావచ్చు. ఆ దెబ్బకి తెలంగాణాలో మళ్ళీ వైకాపా మరోమారు తుడిచిపెట్టుకుపోవచ్చు.