జెడి అంటే జాయింట్ డైరెక్టర్…కానీ అదే ఆయన ఇంటి పేరు అన్నంతగా పాపులర్ అయిపోయారు. ఆయనే సిబీఐ మాజీ జెడి లక్ష్మినారాయణ. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు, క్విడ్ ప్రో లీలలను బయటపెట్టి, ఒకటీ రెండూ కాదు ఏకంగా 11 చార్జ్ షీట్లు నమోదు చేసిన ఘనుడు ఆయన. ఆ తరువాత మారిన రాజకీయ పరిస్థితులలో అకస్మాత్తుగా అయనని మహారాష్ట్రాకి బదిలీ చేయడం, ఆ వెంటనే జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై చంచల్ గూడా జైలు నుంచి విడుదలయ్యి ఎన్నికలలో తెదేపాను డ్డీకొనడం, అదే సమయంలో మహారాష్ట్రాలోని కాంగ్రెస్ పాలిత ప్రభుత్వం నీతి, నిజాయితీకి మారుపేరుగా నిలిచిన జెడికి ఏ పోస్టింగ్ ఇవ్వకుండా ఆరు నెలలు ఖాళీగా కూర్చోబెట్టి వేధించడం వంటివన్నీ వరుసగా జరిగిపోయాయి.
ఇవ్వన్నీ జరిగి రెండేళ్ళపైనే అయిపోయింది. మళ్ళీ చాలా రోజుల తరువాత నిన్న జెడి ప్రస్తావన వచ్చింది. అది కూడా భాజపా నేత, రాష్ట్ర విఅద్య ఆరోగ్య శాఖ మంత్రి డా. కామినేని శ్రీనివాస్ నోట రావడం ఆలోచింపజేసేదిగా ఉంది.
ఆయన నిన్న విశాఖలో ఒక కార్యక్రమంలో హాజరయినప్పుడు మీడియాతో మాట్లాడుతూ “జగన్మోహన్ రెడ్డికి జెడి లక్ష్మినారాయణ అంటే హడల్. అందుకే ఆయన ఉన్నంతవరకు జగన్ నోరు మెదపలేదు. ఆయన బదిలీ అయిపోగానే జగన్ కి బెయిల్ మంజూరయింది. అప్పటి నుంచే జగన్ చాలా రెచ్చిపోతున్నారు. శాసనసభను ఆయన తన లోటస్ పాండ్ నివాసం అనుకొంటున్నట్లున్నారు. అందుకే సభలో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఎప్పుడు పడితే అప్పుడు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. అక్రమాస్తుల కేసులలో నిత్యం కోర్టుల చుట్టూ తిరిగే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శించే నైతిక హక్కు లేదు,” అని అన్నారు.
జగన్ గురించి ఆయన చేసిన ఆ రెండు వ్యాఖ్యలను కలిపి చూసినట్లయితే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చిపోతున్నట్లయితే, మళ్ళీ జెడిని రప్పించి జగన్ ఆట కట్టిస్తామని హేచ్చారిస్తున్నారేమోననే అనుమానం కలుగుతోంది. ఒకవేళ వచ్చే ఎన్నికలలో కూడా తెదేపా-బీజేపీ కూటమి కలిసిపోటీ చేయదలచుకొన్నట్లయితే, వాటికి జగన్మోహన్ రెడ్డి నుంచే ప్రధానంగా పోటీ ఉంటుంది కనుక అప్పుడు జెడిని మళ్ళీ రంగంలో దింపినా ఆశ్చర్యం లేదు. అయితే తెదేపా నేతల రాజధాని బినామీ భూముల కొనుగోళ్ళపై జగన్ సిబీఐ విచారణ కోసం డిమాండ్ చేస్తున్నపుడు, వాటిపై విచారణకు జెడిని రప్పించి ఉండి ఉంటే అందరూ హర్షించేవారు కదా! కానీ రప్పించడం లేదంటే తెదేపా నేతలకి కూడా జెడి అంటే హడల్ అని అర్ధమవుతోంది.