ఆంధ్రప్రదేశ్లో ఉన్న మద్యం బ్రాండ్లన్నింటికీ చంద్రబాబే అనుమతి ఇచ్చారని సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా తేల్చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డిస్టిలరీకి కానీ ఒక్క బ్రూవరీకి కానీ అనుమతి ఇవ్వలేదన్నారు. ఏపీలో చీప్ లిక్కర్ లేనే లేదని.. చంద్రబాబు అనుమతి ఇచ్చిన బ్రాండ్లనే అమ్ముతున్నామన్నారు. అమ్మఒడి తమ బ్రాండ్ అయితే బూం బూం ,పవర్ స్టార్ లాంటివి చంద్రబాబు బ్రాండ్ అన్నారు. బ్రాండ్లన్నీ చంద్రన్న కానుకలే అని అన్నారు. ఇవన్నీ చంద్రబాబు ఆశీస్సులతో వచ్చిన బ్రాండ్లే అని తెలిపారు. ఈ బ్రాండ్లను మేం క్రియేట్ చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. తమ వాళ్లు కల్తీ సారా తాగి చనిపోలేదని అక్కడి మృతుల కుటుంబీకులు చెప్పిన వీడియోల్ని అసెంబ్లీలో ప్రదర్శించారు.
అన్నీ చంద్రబాబు తెచ్చిన బ్రాండ్లే అమ్ముతున్నామన్న జగన్ వాదన అందర్నీ విస్మయ పరుస్తోంది. చంద్రబాబు అనుమతిఇస్తే ఇప్పుడు వాటిని.. అదికూడా వాటిని మాత్రమే ఎందుకు అమ్ముతున్నారన్నది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందిన బ్రాండ్లను నిషేధించి.. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా అమ్మకానికి పర్మిషన్ బ్రాండ్లను ఏపీలోనే ఎందుకు అమ్ముతున్నారంటే.. దానికి సమాధానంగా చంద్రబాబు అనుమతులు ఇచ్చారని సీఎం జగన్ చెబుతున్నారు. డిస్టిలరీలు కూడా టీడీపీ నేతలవేనని గత ఏడాదే అమ్ముకున్నారని.. కొన్ని డిస్టిలరీల పేర్లను కూడా జగన్ చెప్పారు.
మొత్తంలో ఏపీలో లిక్కర్ బ్రాండ్లు టీడీపీవేనని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు ఉన్నప్పుడు ఈ బ్రాండ్లేవీ అమ్మకానికి రాలేదని జగన్ సీఎం అయిన తర్వాతనే ఈ బ్రాండ్లను మాత్రమే అమ్మకానికి పెట్టారనే సంగతిని జగన్ చెప్పలేదు. మొత్తంగా ఏపీలో విస్తృతంగా జరుగుతున్న మద్యం మరణాలు… మద్యం నాణ్యతపై చర్చకు సీఎం జగన్ రాజకీయ పరమైన ఆరోపణలతో కొత్త కోణం జోడించారు కానీ.. వాటిని ఆపేస్తామని కానీ.. నిషేధిస్తామని కానీ చెప్పలేదు. చివరికి తాము ఇచ్ిచన దశలవారీ హామీ మద్యనిషేదం గురించి కూడా జగన్ చెప్పలేదు.