రెడ్బుక్ది ఏముంది అందరూ రాస్తారు.కానీ గుడ్ బుక్ రాసే లీడరే జగన్. అయితే గుడ్ బుక్లో ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు రాయడం లేదు. ఎందుకంటే జగన్ రెడ్డికి టీడీపీ ఏం చేసినా తప్పుగానే కనిపిస్తుంది. అది ఆయన బలహీనత. మరి గుడ్ బుక్లో ఏం రాస్తారంటే.. సొంత పార్టీకి చెందిన వారు పార్టీ కోసం ఎంత కష్టపడితే అంత గట్టిగా బుక్లో పేరు నమోదు చేస్తారట. మరి చేసి ఏం చేస్తారో చెప్పలేదు కానీ ఆయన ఉద్దేశం ప్రకారం అధికారంలోకి రాగానే ఏది కావాలంటే అది ఇస్తారు.
మరి జగన్.. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుండి ఆయన వెంట ఉంటున్న వారికి ..అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మందికి మేలు చేశారు ?. కనీసం పార్టీ కార్యకర్తలను కూడా పట్టించుకోలేదే. పార్టీ కార్యకర్తలతో పని లేదని వాలంటీర్లను పెట్టుకున్నారు. ఎమ్మెల్యేల కన్నా వాలంటీర్లే గొప్ప అని చెప్పుకున్నారు. వారిని లీడర్లు చేస్తానని కూడా ప్రకటించారు. మరి మన ప్లేట్లో మన బిర్యానీ అని అంతకు ముందు చెప్పిన పెద్ద పెద్ద మాటలు.. అధికారంలోకి వచ్చాక ఎందుకు పట్టించుకోలేదో ఇప్పటికీ చెప్పాల్సి ఉంది .
పదేళ్లు సోషల్ మీడియాలో వైసీపీ కోసం పని చేసిన వాళ్లు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరూ కనిపించలేదు. అంతా ప్రజాధనం లూటీ కోసం వచ్చి చేరిపోయారు. అంతా పేమెంట్ బ్యాచ్ తప్ప.. ఎవరూ పార్టీ కోసం పని చేసేవారు లేరు. సోషల్ మీడియా కోసం పని చేసి ఆరోగ్యం చెడిపోయి ఓ కీలక వ్యక్తి బెంగళూరులో చనిపోతే.. పట్టించుకున్న దిక్కు లేదని అప్పట్లో వైసీపీ నేతలు కూడా వాపోయారు. ఇప్పుడు కొత్తగా గుడ్ బుక్ పేరుతో మళ్లీ తనను నమ్మేవారిని జగన్ నట్టేట ముంచడానికి రెడీ అవుతున్నారు.