ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి జెరూసలెం పర్యటనకు వెళ్లారు. కుటుంబసమేతంగా.. పూర్తి వ్యక్తిగతంగా చేసుకుంటున్న పర్యటన అది. తమ కుటుంబ నిరంతరం నమ్మే… జీసస్ పుట్టిన ప్రదేశాన్ని చూడటానికి వెళ్లారు. ముఖ్యమంత్రి పదవి .. ఆ దేవుడే ఇచ్చాడని జగన్ గట్టినమ్మకం. అది ఆయన మాటల్లోనే చెబుతూంటారు. అందుకే.. పదవి వచ్చిన రెండు నెలల్లోనే ఆయన జెరూసలేంలో తాను నమ్మే దేవుడ్ని సేవ చేసుకు రావాలని నిర్ణయించుకున్నారు. వెళ్లారు కూడా. పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని.. ఖర్చులు మొత్తం.. జగనే పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదని ప్రకటించారు. కానీ.. హటాత్తుగా.. రూ. ఇరవై రెండున్నర లక్షల రూపాయలను.. జగన్ జెరూసలెం పర్యటన కోసం.. విడుదల చేశారు. అయితే..వీటిని సెక్యూరిటీ ఖర్చులుగా చూపించారు.
జగన్మోహన్ రెడ్డి ఒకటో తేదీ వెళ్తున్నారు.. నాలుగో తేదీ తిరిగి వస్తారు. జీసస్ జన్మస్థలంలో ఆయన రెండు రోజుల పాటు ఉంటారు. ప్రార్థనల్లో పాల్గొంటారు. పూర్తిగా వ్యక్తిగత పర్యటన కావడంతో.. ఆయన కార్యదర్శి ధనుంజయరెడ్డి, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ జోషి మాత్రమే జగన్మోహన్ రెడ్డితో పాటు వెళ్తున్నారు. అయినప్పటికీ.. అక్కడ భద్రతా ఏర్పాట్ల కోసం.. రూ. 22 లక్షల 50 వేల రూపాయలు విడుదల చేశారు. బహుశా… వ్యక్తిగత పర్యటనకు… ప్రభుత్వ నిధులు ఎలా వాడతారన్న విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో… ఇలా సెక్యూరిటీ పేరుతో.. టూర్ మొత్తానికి కావాల్సిన నిధులను విడుదల చేశారని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ముఖ్యమంత్రి సెక్యూరిటీ కోసం.. ఇజ్రాయెల్లో ప్రైవేటు ఏజెన్సీలను నియమించుకున్నా.. రెండు, మూడు రోజులకు.. రూ. ఇరవై రెండున్నర లక్షల ఖర్చు అయ్యే అవకాశం లేదు. ఇదే రాజకీయ విమర్శలకు కారణం అవుతోంది. త్వరలో జగన్మోహన్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లబోతున్నారు. అది కూడా.. వ్యక్తిగత పర్యటనే. పూర్తిగా.. పార్టీ వ్యవహారాల కోసం వెళ్తున్నారు. ఏపీ సీఎంగా ఎలాంటి అధికారిక కార్యక్రమంలోనూ పాల్గొనరు. ఆ పర్యటన కొంత సుదీర్ఘంగా ఉంటుంది. ఇజ్రాయెల్లో రెండు, మూడులకే.. రూ. ఇరవై రెండున్నర లక్షలు భద్రతా ఏర్పాట్లకు రిలీజ్ చేస్తే.. ఇక అమెరికా టూర్కు ఆ ఖర్చు కోట్లలోనే ఉంటుందన్న అంచనాలు ప్రారంభమయ్యాయి.