ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అవ్వబోయే 4 రాజ్యసభ సీట్లలో ఒకటి వైకాపాకి దక్కుతుంది కానీ ఆ ఒక్కటి కూడా దానికి దక్కకుండా చేస్తామని తెదేపా ముందే ప్రకటించేసి వైకాపాపై యుద్దానికి బయలుదేరింది. కనుక ఈ విషయంలో తెదేపాకి చాలా క్లారిటీ ఉందని స్పష్టం అయిపోయింది. పార్టీ నుంచి 11మంది ఎమ్మెల్యేలు బయటకి వెళ్ళిపోయాక జగన్మోహన్ రెడ్డికి కూడా దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చినట్లుంది. అందుకే ఆయన పార్టీ మారబోతున్నారని అనుమానం వచ్చిన గొట్టిపాటి రవి, మేకా ప్రతాప్ అప్పారావులను పిలిపించుకొని చంద్రబాబు నాయుడు పులిహోర-కరివేపాకు తత్వం గురించి క్లాస్ పీకారు.
తమ పార్టీకి దక్కాల్సిన నాల్గవ రాజ్యసభ సీటుని కూడా తమ ఖాతాలో వేసుకోనేందుకే చంద్రబాబు నాయుడు వైకాపా ఎమ్మెల్యేలను తెదేపాలోకి పిలుస్తున్నారు తప్ప మీ మీద ప్రేమతో కాదని జగన్మోహన్ రెడ్డి వారికి నచ్చజెప్పారు. కనుక రాజ్యసభ ఎన్నికలు పూర్తికాగానే తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలందరినీ ఆయన పులిహోరలో కరివేపాకులాగ తీసి పక్కన పడేస్తారని జగన్ తన ఎమ్మెల్యేలను హెచ్చరించారు. వైకాపా ఎమ్మెల్యేల సహాయంతో వైకాపానే ఓడించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తుంటే, ఆ సంగతి గ్రహించి కూడా మీరు తెదేపాలోకి వెళ్ళడం సమంజసమా? అని జగన్ వారిని ప్రశ్నించారు. ఆ ఒక్క రాజ్యసభ సీటు మనం దక్కించుకోలేకపోతే రాష్ట్రంలో పార్టీ బలహీనపడిపోయిందని తెదేపా ప్రచారం మొదలుపెట్టి మనల్ని ఇంకా బలహీనపరిచే ప్రయత్నం చేస్తుంది కనుక తెదేపా ప్రలోభాలకు లొంగకుండా నిలబడాలని జగన్ కోరారు. పార్టీలోనే కొనసాగినట్లయితే మీకు మున్ముందు చాలా మేలు కలుగుతుంది అందుకు నేను హామీ ఇస్తున్నానని జగన్మోహన్ రెడ్డి వారికి నచ్చజెప్పినట్లు తెలుస్తోంది.
రాజ్యసభ ఎన్నికలయ్యేవరకే తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తారని జగన్ వెలిబుచ్చిన అభిప్రాయం నూటికి నూరు శాతం నిజం కావచ్చును. భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ వంటి సీనియర్లకి తప్ప మిగిలిన వారిని పెద్దగా పట్టించుకోకపోవచ్చును. పట్టించుకొనేమాటయితే తెదేపాలోనే ఏ గుర్తింపుకి నోచుకోని అనేకమంది ఎమ్మెల్యేలు ఎందుకున్నారు?