ఆస్తుల వివాదంలో జగన్ రెడ్డి కొంపకు నిప్పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ నిప్పు ఎవరు ఆపుతారా అని చూస్తున్నారు. పులివెందులలో మూడు రోజుల పర్యటనకు వెళ్లిన ఆయన బంధువుల ఇళ్లకు స్వయంగా వెళ్తున్నారు. వైఎస్ బంధువులు అంతా క్రిస్టియన్సే. ఎవరూ దీపావళి పండుగ జరుపుకోరు. పండుగ శుభాకాంక్షలు చెప్పడానికి ఆయన వెళ్లలేదు. తన ఇంట్లో ..స్వయంగా తాను పెట్టుకున్న నిప్పును ఆర్పాలని ఏదో దారి చూపారని అడిగేందుకు ఆయన వెళ్లారు.
గతంలో జగన్ రెడ్డి దగ్గరకే అందరూ రావాలి. బంధువులు అయినా ఎవరు అయినా అసలు తగ్గరు. అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు వచ్చి మంచీచెడూ చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు జగన్ రెడ్డి వారి ఇళ్లకు వెళ్తున్నారు. వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ ప్రకాష్ రెడ్డి వంటి బంధువుల ఇళ్లకు వెళ్లారు. మరో మూడు, నాలుగు ఇళ్లకు వెళ్లి అక్కడ పెద్దలతో చర్చలు జరిపి వచ్చారు. అంతా తన తల్లితో రాయబారం కోసమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.
విజయమ్మ రాసిన బహిరంగలేఖతో జగన్ రెడ్డి వికృత మనస్థత్వం.. తల్లీ, చెల్లీనీ మోసం చేయాలనుకున్న వ్యవహారం ప్రజల ముందు బయటపడింది. ఈ ఇమేజ్ నుంచి బయటపడాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలు అంత తేలికగా ఫలితం ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే ఏదో విధంగా పరిష్కారం చేసుకుందామని అమ్మతో రాయబారం నడపాలని జగన్ వారిని బతిమాలుతున్నారు. జగన్ కోర్టుకు కూడా వెళ్లిన తర్వాత మేమేం చేయగలమని వారు సమాధానమిస్తున్నట్లుగా తెలుస్తోంది.