ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు మరోసారి భేటీ కాబోతున్నారు. ఈ నెల ఇరవై నాలుగో తేదీన వారి సమావేశం జరగనుంది. విభజన సమస్యలు, కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ఎజెండాగా వీరి సమావేశం జరుగుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. కానీ అంతకు మించి పొలిటికల్ ఎజెండా ఉందన్న అభిప్రాయం.. బయట వినిపిస్తోంది. ప్రధానంగా.. కేంద్ర ప్రభుత్వం.. తమకు ఏ మాత్రం సహకరించడం లేదన్న అభిప్రాయంతో ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు. పైగా.. రాష్ట్రాలకు వస్తున్న కేంద్రమంత్రులు అదే పనిగా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. బీజేపీని ఎలా ఎదుర్కోవాలన్నదానిపై… కేసీఆర్, జగన్ కలిసి నిర్ణయం తీసుకుంటారని అంచనా వేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్ట్ సహా… ఏ విషయంలోనూ కేంద్రం తమ ఆలోచనలకు అనుగుణంగా సహకరించడం లేదని.. జగన్మోహన్ రెడ్డి కేంద్రం తీరుపై అసంతృప్తిగా ఉన్నట్లుగా సెక్రటేరియట్లో ప్రచారం జరుగుతోంది. జగన్ ఇజ్జత్ గా భావించిన పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ల విషయంలో అడుగు ముందుగు వేయకుండా.. కేంద్రం… గట్టి హెచ్చరికలే చేసింది. దాంతో.. వెనుకడుగు వేయక తప్పలేదు. ఇక పోలవరం ప్రాజెక్ట్ విషయంలో… నిపుణుల కమిటీ నివేదికతో.. ఏపీ సర్కార్ ను.. ఇరికించేందుకు కేంద్రం… ఏర్పాట్లు చేసుకుంటోందని జగన్ అనుమానిస్తున్నారు. అందుకే.. ఆ నివేదికకు సాక్ష్యాలు కావాలని అడుగుతున్నారని భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ గండం నుంచి బయటపడటానికి.. ఆ నివేదికతో ఏకీభవించడం లేదన్న సమాధానం పంపి బయట పడే ప్రయత్నం చేశారు. ఇక అమరావతి విషయంలో ఇచ్చిన నివేదికతోనూ.. బీజేపీ తమను బ్లాక్ మెయిల్ చేస్తోందని.. కొన్నాళ్లుగా… ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనలను బట్టి జగన్ కూడా నమ్ముతున్నారు. ఇక ఆర్థిక సాయం… ఇతర విషయాల్లోనూ కేంద్రం… ఏపీని అసలు పట్టించుకోవడం లేదు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా.. కేంద్రంపై ఆగ్రహంతో ఉన్నారు. కేంద్రం నుంచి ఒక్కటంటే.. ఒక్క రూపాయి సాయం అందడం లేదు. అందుకే.. బడ్జెట్ ను ఇరవై శాతానికిపైగా కోత పెట్టాల్సి వచ్చింది. ఇక రాజకీయంగానూ కేసీఆర్ ను సవాల్ చేస్తున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను లాగేసుకోవడానికి బీజే్పీ తీవ్ర ప్రయత్నం చేస్తోందని.. దీని వెనుక అమిత్ షా ఉన్నారని.. కేసీఆర్ గట్టిగా నమ్ముతున్నారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డిని కలుపుకుని… కేంద్రంపై.. తిరుగుబాటు చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా చెబుతున్నారు.
అయితే.. కేంద్రంపై..ఏ స్థాయిలో వ్యతిరేక పోరాటం చేయాలనుకున్నా.. అది ప్రమాదకరమే అవుతుందని.. రెండు పార్టీల అగ్రనేతలకు తెలియనిది కాదు. అలా అని సైలెంట్ గా ఉంటే.. బీజేపీ తమను.. ముంచేస్తుందని… కూడా తెలుసు. అందుకే మధ్యేమార్గంగా.. అటు పోరాడుతున్నట్లుగా.. ఇటు… సహకరిస్తున్నట్లుగా.. ఎలా వ్యవహరించాలన్నదానిపై అంతిమంగా ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.