హైదరాబాద్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఒక కీలక అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో భాజపా అనుసరిస్తున్న వ్యూహాలపైనా, ఆ పార్టీ తీరుపైనా సీఎంలు చర్చించినట్టు సమాచారం. పార్టీని విస్తరించే ధోరణిలో రాష్ట్ర స్థాయిలో దూకుడుగా వ్యవహరిస్తున్న భాజపాను ఎలా ఎదుర్కోవాలి, ఇదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి, తెలుగు రాష్ట్రాలకు కేంద్రం అవసరం ఎక్కువగా ఉంది కాబట్టి… ఎలా వ్యవహరించాలి అనే అంశంపై సీఎంలు కాసేపు మాట్లాడుకున్నట్టు సమాచారం. జరూసలెం పర్యటన ముగించుకోగానే నేరుగా ఢిల్లీ వెళ్లబోతున్న సీఎం జగన్, ఈ అంశంపై కేసీఆర్ తో ముందుగా చర్చించడం కొంత ప్రత్యేకంగానే చూడాలి.
ఆంధ్రా తెలంగాణల్లో భాజపా దూకుడు పెంచిన తీరు చూస్తున్నాం. తెలంగాణలో తెరాసకు మేమే ప్రత్యామ్నాయం అంటూ ఎప్పుడు ఎన్నికలొచ్చినా అధికారంలోకి తామే వస్తామంటూ వలసల్ని ప్రోత్సహించి దూసుకెళ్తోంది. ఆంధ్రాలో కూడా భాజపా నేతలు మొదట్నుంచే జోరు పెంచారు. టీడీపీ ఎంపీలను ఆకర్షించారు. సీఎం జగన్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందనీ, సీఎం తప్పటడుగులు వేస్తున్నారంటూ రామ్ మాధవ్ తోపాటు, కన్నా లక్ష్మీనారాయణ ఇతర భాజపా నేతలు అక్కడా విమర్శల జోరు పెంచుతున్నారు. భాజపా విమర్శలకు తెరాస కొంత ధీటైన ప్రతివిమర్శలు చేసే ప్రయత్నం చేస్తోందిగానీ, వైకాపా నుంచి ఆ స్థాయిలో స్పందన ఇంతవరకూ కనిపించడం లేదు.
నిజానికి, రెండు రాష్ట్రాలూ భాజపాకి ధీటుగా రాజకీయం చేస్తాయనే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. ఎందుకంటే, మొన్నటికి మొన్న… రాజ్యసభలో సమాచార హక్కు సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెడితే, వ్యతిరేకించామని ప్రకటించిన తెరాస నేత కే. కేశవరావు తరువాత మద్దతు ఇచ్చారు. ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లు వచ్చేసరికీ ఏకంగా ఓటింగ్ కి దూరమై పరోక్షంగా భాజపాకి సాయం చేశారు. వైకాపా నాయకుడు విజయసాయి రెడ్డి కూడా దాదాపు ఇదే ధోరణి వహించారు. తెరాస, వైకాపా… ఈ రెండూ భాజపాకి లొంగిపోయే విధంగానే ఢిల్లీలో వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రాలకు వచ్చేసరికి భాజపా వ్యూహాలపై ఎలా స్పందించాలనే స్పష్టమైన విధానాన్ని కేసీఆర్, జగన్ లు తీసుకోలేకపోతున్నారన్నది వాస్తవం. సరే, రాష్ట్ర స్థాయిలో భాజపా రాజకీయాల అంశాన్ని కాస్త పక్కనబెడితే… రెండు రాష్ట్రాలూ కేంద్రంతో సయోధ్యగా మెలగడమే అన్ని విధాలుగా శ్రేయస్కరం. పోలవరం, కాళేశ్వరం, అమరావతి, తెలంగాణలో ఇతర ప్రాజెక్టులు… ఇలా రెండు రాష్ట్రాలకూ సాయం చెయ్యాల్సిన అవసరం భాజపాకీ ఉంది. రాబట్టుకునేలా వ్యవహరించాల్సిన బాధ్యతా ఇద్దరు ముఖ్యమంత్రుల మీదా ఉంది. మరీ గతంలో మాదిరిగా భాజపా మొండికేస్తూ పోతే… కేంద్రంపై ఒత్తిడి పెంచే మార్గాలను కూడా ఇద్దరు సీఎంలూ అన్వేషించాల్సి ఉంటుంది. ఏదేమైనా, రాష్ట్రంలో భాజపా తీరును కొంత భరించాల్సిన పరిస్థితే తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలకు ప్రస్తుతానికి తప్పేట్టుగా లేదు!