తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక రోజు తేడాతో ఒకరి తర్వాత ఒకరు ప్రధానమంత్రి మోదీతో సమావేశం కానున్నారు. వేర్వేరు అంశాలపై మోదీతో సమావేశానికి వెళ్తున్నారని చర్చ జరుగుతున్నప్పటికి.. ఉమ్మడి ప్రాజెక్ట్ ఎజెండానే కీలకమని ఢిల్లీలో చర్చ జరుగుతోంది. కేసీఆర్ నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఢిల్లీలో సమావేశయ్యే అవకాశం కనిపిస్తంది. నవరత్నాల అమలుతోపాటు రివర్స్ టెండరింగ్, గోదావరి జలాలు శ్రీశైలానికి మళ్లింపుపై రెండు రాష్ట్రాల మధ్య జరిగిన చర్చలు, పీపీఏల గురించి వివరణ వంటి అంశాలను జగన్.. ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. కరెంట్ కొరత దృష్యా అదనపు బొగ్గు కోసం విజ్ఞప్తి చేయనున్నారు. అక్టోబర్ 15వ తేదీ నుంచి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు రావాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు.
ఉమ్మడి అంశం ఉండబట్టే ఒకరి తర్వాత ఒకరి భేటీ..?
మోదీతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరి తర్వాత ఒకరు భేటీ అంటే. కచ్చితంగా.. ఉమ్మడిగా ఉన్న అంశం ఏదో ఉందని రాజకీయవర్గాలకు అర్థం అవుతుంది. అది రాజకీయం కూడా కావొచ్చని అంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా కాలం తర్వాత మోదీతో భేటీ కాబోతున్నారు. రాజకీయ విబేధాల వల్లే ఇంత కాలం.. మోదీతో సమావేశానికి అవకాశాలు వచ్చినా ఢిల్లీకి వెళ్లలేదని ప్రచారం జరిగింది. కారణాలేవైనా ఇప్పుడు.. కేసీఆర్కు కేంద్రం అండ కావాలి. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అంతే. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఏపీ బయటపడాలంటే… మోదీ అండ కావాలి. రాజకీయంగానూ… జగన్ కు ఆ అవసరం ఉంది.
టీఆర్ఎస్, వైసీపీ పాలనపై ఇప్పటికే ప్రధానికి నివేదికలు..!
అయితే.. తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అక్కడ టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థిగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ కేసీఆర్ ను టార్గెట్ చేస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఏపీ సీఎం జగన్ సన్నిహితంగా మెలగటం, తెలంగాణతోపాటు ఆంధ్రాలో ఉన్న బీజేపీ నేతలక్కూడా ఈ వ్యవహారం అసలు నచ్చడంలేదు. ఇప్పటికే బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్రంలో జగన్ సర్కార్ పరిపాలన, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై బహిరంగంగానే విమర్శలు చేయటంతోపాటు కేంద్రంలోని బీజేపీ అధిష్టాన పెద్దలకు ఒక నివేదిక అందించారు.
కేంద్రం స్పందనపై ఢిల్లీలో చర్చలు జరపనున్న ఇద్దరు సీఎంలు..!
ప్రధాని మోదీతో భేటీ తర్వాత .. ఇద్దరు ముఖ్యమంత్రులు ఢిల్లీలో చర్చలు జరిపే అవకాశం ఉంది. కేసీఆర్ నాలుగు రోజుల పాటు ఢిల్లీలో ఉంటారు. శనివారం .. వీరిద్దరూ ఢిల్లీలో సమావేశమయ్యే అవకాశం ఉంది. తమ డిమాండ్లపై కేంద్రం స్పందనపై వారు చర్చించనున్నట్లు గా చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఇద్దరూ ప్రగతి భవన్లో సమావేశమై చర్చించిన తర్వాత… బీజేపీకి వ్యతిరేకంగా.. పని చేయాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరిగింది.దాంతో.. ఢిల్లీ పర్యటనలో వారికి టెన్షన్ ప్రారంభమయింది.