జగన్ యువభేరి మొదలెట్టాడు. ప్రత్యేక హోదా కోసం జరిపే పోరు గా దీన్ని వైసిపి వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఇక జగన్ స్వంత మీడియా సాక్షి లో ప్రత్యేక హోదా కోసం గళమెత్తిన ఏకైక నాయకుడంటూ కథనాలు మొదలయ్యాయి. అయితే ఒక విషయం లో జగన్ నుంచి రాజకీయ వర్గాలు క్లారిటీ ఆశిస్తున్నాయి. మరి జగన్ వారికి ఆ క్లారిటీ ఇస్తాడా? వివరాల్లోకి వెళితే…
ప్రత్యేక హోదా అనేది రాజ్యసభ సాక్షిగా ఆనాడు ప్రధాని మన్మోహన్ చేసిన వాగ్దానం. దీనికోసం ఆనాడు పోరాడిన బిజెపి ఇప్పుడు అధికారం లో ఉంది. కానీ హోదా ఇవ్వడానికి మాత్రం వారు ఇప్పుడు సిద్దంగా లేరు. టిడిపి కి పొత్తు పుణ్యమా అని తన తిప్పలు తనకి ఉన్నాయి. ఇక హోదా కోసం పోరాడాల్సిన మిగతా పార్టీల్లో వైసిపి ముందు ఉంది. నిజానికి హోదా విషయం లో జగన్ పలు మార్లు సభలు, ఉద్యమాలు పెడుతున్నాడు. కానీ, హోదా ఇవ్వకుండా తప్పించుకుతిరుగుతున్న మోడీ ని కానీ, వాళ్ళ పార్టీ ని కానీ, అధ్యక్షుడు అమిత్ షా ని కానీ పల్లెత్తు మాట అనడం లేదు. ఇదిగో ఈ కారణంగానే జగన్ ఎన్ని సార్లు ఉద్యమించినా అది ప్రజల్లో రిజిస్టర్ కావడం లేదు. ఎంతసేపూ చంద్రబాబు వల్లే హోదా రాలేదు అని తిడుతూ, అదే వాదన ప్రజలు నమ్మేలా చేయడానికి ఒక కన్వల్యూటెడ్ (convoluted) లాజిక్ ని తయారు చేసి దాన్ని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేయడం వల్ల జగన్ కి మైలేజ్ రావడం లేదు. మరి ఈసారైనా సూటిగా సుత్తి లేకుండా “హోదా” ని కాల గర్భం లో కలపడానికి కారణమవుతున్న వారిని నేరుగా విమర్శిస్తాడా అనేది ఆసక్తికరంగా ప్రజలు గమనిస్తున్నారు. ఇక ఇదే కాక రాజకీయవర్గాలు క్లారిటీ కొసం ఎదురు చూస్తున్న అంశం మరొకటి ఉంది.
అదే ఎంపీల రాజీనామా. గత ఏడాది జగన్ మాట్లాడుతూ, హోదా కోసం తమ పార్టీ ఎంతో పోరాటం చేస్తుందని, పార్లమెంట్ లో దీన్ని ప్రస్తావిస్తామని, అప్పటికీ సాధ్యం కాకపోతే 2017 జూన్ కల్లా మా ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించాడు. అయితే ఆ తర్వాత వైసిపి ఎంపీలు దీనికి ససేమిరా అన్నట్టు వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు జూన్ అయిపోయి అక్టోబర్ వచ్చింది. మరి ఇప్పుడైనా ఎంపీల తో రాజీనామా చేయించి ఈ సమస్య మీద దేశవ్యాప్త చర్చ జరిగేలా చేస్తాడా? లేక యథామామూలుగా చంద్రబాబు ని నాలుగు తిట్టి కేంద్ర ప్రభుత్వం హోదా ఇవ్వకపోవడానికి అత్యంత ప్రధానమైన ముఖ్య కారణం చంద్రబాబు “గట్టిగా” అడగకపోవడమే అని తీర్మానించేసి, భేరి ముగిస్తాడా అనేది వేచి చూడాలి.