ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లకుండా ఫిర్యాదు చేసుకునే ఓ కొత్త వెసులుబాటును ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రత్యేకంగా యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఏపీ పోలీస్ సర్వీస్ యాప్‌ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పోలీస్ స్టేషన్లు ఈ యాప్‌కు అనుసంధానమై ఉంటాయి. అన్ని నేరాలపై కొత్త యాప్‌లో ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరమే లేకుండా…87 రకాల సేవలను పోలీస్ సర్వీస్ యాప్ ద్వారా పొందవచ్చు. అన్ని నేరాలపై కొత్త యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సీఎం జగన్ తెలిపారు.
పోలీస్ సర్వీస్ యాప్ పోలీస్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాందిగా సీఎం జగన్ అభివర్ణించారు. ఈ రోజు నుంచే ప్రజలకు అందుబాటులో ఉంటుందని.. పీఎస్‌లకు వెళ్లే అవసరం లేకుండా చేసేందుకు యాప్‌ను రూపొందించామని సీఎం జగన్ ప్రకటించారు. ఫోన్లు పోయినా… ఈవ్ టీజింగ్ చేసినా.. లేదా ఇతర నేరాల బారిన పడినా.. చాలా మంది పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లి చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. జరిగిన నష్టం కంటే..పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే ఇబ్బంది.. ఎక్కువ ఉంటుందని వారు భావిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ సమస్య లేకుండా… పోలీస్ స్టేషన్‌కు వెళ్లే అవసరమే లేకుండా… యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశాన్ని పోలీసులు అందుబాటులోకి తెచ్చారు.
అయితే దిశ యాప్ లాగా కాకుండా.. ఫిర్యాదు చేసిన ప్రతీ ఒక్కరికి నమ్మకం కలిగేలా… సర్వీసు అందిస్తే.. సంచలనాత్మక సంస్కరణ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడే యాప్ ను.. అందుబాటులోకి తెచ్చారు కాబట్టి పోలీసులు ఎంత ఎక్కువగా రెస్పాండ్ అయితే.. ఎంత ఎక్కువగా నమ్మకాన్ని చూరగొంటారు. లేకపోతే.. ఆవిష్కరించి మూలన పడేసిన అనేక యాప్‌ల్లా ఇది కూడా మారిపోయే ప్రమాదం ఉంది.