ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారత కోసం.. మరో వినూత్నమైన ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ చేయూత పథకాన్ని తాడేపల్లిలోని ఇంటి నుంచి ప్రారంభించారు. ఏడాదికి రూ. 18,750 ఇచ్చే ఈపథకం నగదును వారు స్వయం స్వాలంబన సాధించేందుకు ఉపయోగించుకునేలా చూసేందుకు సంకల్పించారు. ప్రముఖ కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని వారి ద్వారా.. లబ్దిదారులైన మహిళలు చిన్న స్థాయి ఉపాధి కార్యక్రమాలు చేపట్టేలా ఈ పథకాన్ని రూపొందించారు. అమూల్, ఐటీసీ, హెచ్యూఎల్, పీ అండ్ జీ, జియోమార్ట్ లాంటి ప్రఖ్యాత, దిగ్గజ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. లబ్ధిదారులకు రూ.18,750 నగదుతో పాటు రెండు పేజీల లేఖ కూడా పంపుతున్నారు. ఆసక్తి ఉన్న వారు ఆ ఫాంను పూర్తి చేసి.. వాలంటీర్లకు ఇ్సతే.. ఒప్పంద సంస్థలతో వ్యాపారానికి మార్గం సుగమం అవుతుంది.
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్రలో 45 ఏళ్లకే ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు పెన్షన్ ఇస్తానని జగన్ ప్రకటించారు. అయితే.. అలా ఇవ్వడం సాధ్యం కాదనుకున్నారేమో కానీ.. తర్వాత పథకాన్ని మార్చి రూ. 75వేలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. ఆ రూ. 75వేలను నాలుగేళ్ల పాటు.. ఏటా రూ. 18750 ఇవ్వాలని నిర్ణయించారు. 45 ఏళ్ల వయస్సు నిండి 60 ఏళ్ల మధ్య ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఇస్తున్నారు. అన్ని రకాల అర్హతులు ఉన్న దాదాపు పాతిక లక్షల మందికి ఈ పథకాన్ని వర్తింప చేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.
ఈ పథకం లబ్దిదారులైన మహిళలకు ఔత్సాహిక వ్యాపారస్తులుగా మారడానికి అవసరమైన సాంకేతిక, మార్కెటింగ్ సహకారాలను ఈ కంపెనీలు అందిస్తాయి. సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం అవకాశాలను కల్పిస్తాయి. ఈ కంపెనీల భాగస్వామ్యం వల్ల వారికి జీవనోపాధి కలగడమే కాకుండా, గ్రామీణ స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.