సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు తమదైన శైలిలో చేస్తున్నారు. అయితే సీఎం జగన్ను మెప్పించాలంటే ఆస్పత్రిలో పండ్లు పంచడం.. లేదా మరో కార్యక్రమం చేసి ఫోటోలు వేయించుకుంటే సరిపోదు. అంతకు మించిచేయాలి. అలా చేయగలిగిన నేతలు అందరూ కాదు. అందుకే సీఎం జగన్ మనసెరిగిన… స్థాయి ఉన్న నేతలు తమ శక్తివంచన లేకుండా ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు ఖర్చుకు వెనుకాడలేదు. సీఎం జగన్పై అభిమానంతో ఆయన సొంత పత్రికకు రూ. కోట్లు వెచ్చించి ప్రకటనలు ఇవ్వడానికి నేతలు పోటీ పడ్డారు. ఆ విషయం సాక్షి దినపత్రిక.. జిల్లా ఎడిషన్లు చూస్తే అర్థమైపోతుంది.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి జగమెరిగిన నేతలు రూ. కోట్లు ఖర్చు పెట్టి పేపర్ ప్రకటనలతో పాటు ఇతర వ్యవహారాలు కూడా చేపట్టారు. జగన్ బొమ్మను ఆర్గానిక్ ఫామింగ్తో గీయించారు. ఇంకాఇలాంటి విచిత్రాలు చాలా జరుగుతాయి. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఏ మాత్రం తగ్గలేదు. బంధువు బంధువే.. తమ్ముడు తమ్ముడే అని ఆయనకు బాగా తెలుసు కాబట్టి తన వంతుగా.. రెండు మూడు పేజీల ఫుల్ పేజీ యాడ్స్ చదివించుకున్నారు. ఇక డబ్బులుండి.. పదవులపై ఆశలు పెట్టుకున్న చాలా మంది.. తమ శక్తి మేర జగన్ను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. జిల్లా స్థాయి నేతలు కూడా ఏ మాత్రంతగ్గలేదు. జగన్ పుట్టిన రోజు అంటే సాక్షి పత్రికకు పండుగరోజు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీఎంగా జగన్ లేనప్పుడు ఎవరూ ప్రకటనలు ఇచ్చే వారు కాదు. కానీ ఇప్పుడు సీఎం కాబట్టి పేజీలకు పేజీలు ఇస్తున్నారు.
ఒక్క రోజు వైసీపీ నేతలు ఇచ్చే ప్రకటనలతో .. సాక్షి పత్రికకు.. కనీసం రెండు, మూడు నెలల పాటు జీతాల ఖర్చు వస్తుందని అంచనా ఉంది. మరి వీరంతా ఏ ప్రతిఫలం ఆశించకుండా ప్రకటనలు ఇస్తారా..? అనే డౌట్ రావొచ్చు. అయితే జగన్ వీరెవర్ని నిరాశ పరచరని వైసీపీలో గట్టి నమ్మకం ఉంది. పదవుల పరంగా.. కాంట్రాక్టుల పరంగా.. వారికి న్యాయం చేస్తారని చెబుతున్నారు. అందుకే..నేతలు రూ. కోట్లు వెచ్చించి ప్రకటనల రూపంలో చదివిచేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదని అంటూంటారు. మొత్తంగా చూస్తే.. జగన్ పుట్టిన రోజునన సాక్షి గల్లాపెట్టే గలగలలాడిందే చెప్పాలి.