షర్మిల కుమారుడి వివాహానికి జగన్ రెడ్డి , ఆయన భార్య వెళ్లలేదు. షర్మిల మీడియా బృందం విడుదల చేసిన ఫోటోలు కలర్ ఫుల్ గా ఉన్నాయి. వైఎస్ బొమ్మను ముందు పెట్టుకుని ఆనందోత్సాహాలతో ఆయన మనవడి వివాహ వేడుకను నిర్వహించుకున్నారు. వైఎస్ విజయమ్మ కూడా హ్యాపీగా ఉన్నారు. కానీ ఇక్కడ మిస్ అయింది మాత్రం షర్మిల అన్న.. వైఎస్ పోయాక.. కుటుంబం మొత్తానికి పెద్దగా బాధ్యతలు తీసుకుని అధికారం సైతం అందుకున్న సీఎం జగన్ రెడ్డి.
కుటుంబంలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఏం జరిగినా ఇంట్లో పెళ్లిళ్లకూ వెళ్లకూడనంత శత్రుత్వం అయితే పెంచుకోకూడదు. ముఖ్యంగా రక్తం పంచుకుపుట్టిన వారితో అసలు పెంచుకోకూడదు. ప్రజాజీవితంలో ఉన్న వారి మైండ్ సెట్ అలాగే ఉండాలి. సొంత వాళ్లనే వ్యక్తిగత స్వార్థాల కోసం దూరం చేసుకుంటే..ఇక ప్రజల్ని.. పార్టీనేతల్ని .. ఎలా దగ్గర చేసుకోగలరు ?. కాస్త లోతుగా ఆలోచిస్తే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో అందర్నీ కోల్పోయారు. తల్లి, చెల్లినే కాదు.. ఆయన సొంత పార్టీ నేతల్ని.. ప్రజల్ని కూడా దూరం చేసుకున్నారు.
గత ఎన్నికల్లో జగన్ రెడ్డి కోసం ప్రాణం పెట్టిపని చేసిన వారిలో సగం మంది ఇప్పుడు ఆయన తీరుపై అసంతృప్తితో దూరమయ్యారు. వ్యతిరేకంగా పని చేస్తున్నారు. మిగిలిన వారిలో అత్యధికంగా సైలెంట్ అయ్యారు. ఓ ప ది శాతం మంది మాత్రం.. .ఏదో ప్రయోజనం వస్తుంది కదా అన్న ఆశతో ఇంకా పని చేస్తున్నారు. సొంత పార్టీ క్యాడర్ ఆయనను నమ్మడం లేదు. జగన్ రెడ్డికి ఇప్పుడు మిగిలింది సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ బ్యాచ్ మాత్రమే. వారికి రాజకీయ పరంగా వచ్చే ఆదాయం ఉన్నంత కాలం ఉంటారు.. తర్వాత వారిలో ఒక్కరు కూడా కనిపించరు.
జగన్ రెడ్డి కాస్త వెనక్కి చూసుకుంటే… తాను సర్వం కోల్పోయానని అర్థం చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఆయన అధికార మత్తులో ఉన్నారు. అది పోతే కానీ దిగరు. మరో రెండు నెలల్లో జగన్ రెడ్డికి తానేం కోల్పోయారో తెలుసునే సమయం వస్తుంది.