న్యాయమూర్తులపై ఫిర్యాదు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీజేఐకి లేఖ రాయడమే కాదు .. దాన్ని మీడియాకు విడుదల చేశారు. ఇప్పుడు అది కోర్టు ధిక్కరణ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ లేఖ విడుదల చేసే ముదు జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు.. ప్రధానమంత్రి నరేంద్రమోడీని కూడా కలిశారు. ఖచ్చితంగా ప్రధాని నరేంద్రమోడీని కలిసిన రోజునే సీజేఐకి ఫిర్యాదు లేఖ పంపినట్లుగా దానిపై తేదీ ఉంది. ఆ ఇష్యూ తర్వాత వైసీపీ నేతలు.. ఓ రకమైన ప్రచారాన్ని ప్రారంభించారు. తాము కేంద్రహోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్రమోడీలకు చెప్పిన తర్వాత ఈ ఫిర్యాదు చేశామని.. మీడియాకు విడుదల చేశామని.. ఆ ప్రచార సారాంశం. ఇది అంతర్గతంగా సాగిపోతోంది.
నిజానికి ఆంధ్రప్రదేశ్లో తాము ఏం చేసినా … కేంద్ర పెద్దలతో చెప్పే చేస్తున్నామని విజయసాయిరెడ్డి పదే పదే చెబుతూంటారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు.. మూడు రాజధానులు వంటి వాటిని ముందుగానే బీజేపీ పెద్దలకు చెప్పారని.. వైసీపీ వర్గాలు చెప్పాయి. దానికి తగ్గట్లుగానే బీజేపీ రియాక్షన్ ఉంది. ఈ విషయాలను ముందుగానే ఢిల్లీ పెద్దలకు పంచుకున్నారు. వారి వైపు నుంచి సానుకూలత రావడంతోనే ముందుకెళ్లారని … బీజేపీ పెద్దల నుంచి వైసీపీ నిర్ణయాల పై వ్యతిరేకత రాకపోవడంతోనే అర్థం చేసుకోవచ్చు., ఈ చొరవతోనే.. ఇప్పుడు న్యాయవ్యవస్థ విషయంలోనూ.. తాము కేంద్ర పెద్దలకు చెప్పే దాడి చేస్తున్నామన్న అభిప్రాయాన్ని వైసీపీ నేతలు కల్పిస్తున్నారు.
న్యాయవ్యవస్థపై ఇలా లేఖలతో దాడి చేయమని… ఆరోపణలు చేసి..మీడియాకు విడుదల చేయమని.. ఏ ప్రధానమంత్రి కానీ.. ఏ హోంమంత్రి కానీ ప్రోత్సహించరు. రాజ్యాంగ వ్యవస్థలు.. న్యాయవ్యవస్థ విశ్వసనీయత ఎంత బలంగా ఉండే.. దేశానికి అంత మంచిదని వారికి తెలియకుండా ఉండదు. అయినప్పటికీ.. వైసీపీ నేతలు.. తాము పెద్దల అనుమతితోనే లేఖ రాశామన్న భావన కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. లేఖ విడుదల చేసే ముందు జగన్ ప్రధాని, హోంమంత్రిని కలవడమే దీనికి సాక్ష్యమంటున్నారు. దీంతో.. ఇప్పుడు.. సహజంగానే కేంద్ర పెద్దలపై అందరి చూపు పడుతోంది. వారు ఈ అంశంపై స్పందించాలని కోరుతున్నారు. జగన్ లేఖ రాసే ముందు మోదీ, అమిత్ షాలను కలిశారు కాబట్టి..దీనిపై స్పందించాల్సిన అవసరం ఉందని వామపక్షాలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాయి.
ఢిల్లీ వర్గాలు జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖను.. నిందితుడు.. న్యాయమూర్తిపై చేసిన ఆరోపణలుగానే చూస్తున్నాయి. అయితే ఆయనకు సీఎం పదవి ఉండటంతో ఇప్పుడు ఆ పదవిలో ఉండటానికి ఆయన అనర్హుడు కాదంటున్నాయి. ఈ సమయంలో ఆ లేఖ వెనుక అమిత్ షా, మోడీలు ఉన్నారన్నట్లుగా వైసీపీ తమ బలం కోసం ప్రచారం చేసుకుంటూడటం మాత్రం.. వారికి ఇబ్బందిరమే. దీనిపై స్పందించాల్సిన పరిస్థితి ఇప్పుడిప్పుడే ఏర్పడుతోంది. ఏపీ బీజేపీ నేతలు మాత్రం.. ఈ విషయంలో ఇంత వరకూ నోరు మెదపలేదు. న్యాయవ్యవస్థకు మద్దతుగా మాట్లాడలేదు.. వైసీపీకి వ్యతిరేకంగా స్పందించలేదు. ఈ విషయంలో బీజేపీ వైఖరి ప్రస్తుతానికి మౌనమే అన్నట్లుగా ఉంది.