ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం తెలుగు వారందర్నీ ఆవేదనకు గురి చేసింది. ఆంధ్రప్రదేశ్ అధికార, ప్రతిపక్ష నేతలను కూడా బాగా బాధపడేలా చేసింది. ఇద్దరూ ఆయనపై అమితమైన అభిమానం చూపిస్తూ..లేఖలు రాస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యానికి భారతరత్న ఇవ్వాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేరుగా ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశారు. ఆ లేఖలో ఎస్పీ బాలు గొప్పతనాన్ని జగన్ అభివర్ణించారు. 50 ఏళ్లపాటు సంగీత ప్రేమికులను అలరించారని .. మాతృభాషలో 40 వేలకుపైగా పాటలు పాడటంతో పాటు.. తమిళ్, కన్నడ, మళయాళం, హిందీలో ఎన్నో పాటలు పాడారన్నారు. అలాగే.. గతంలో భారత రత్న ఇచ్చిన కళాకారుల గురించి చెప్పారు. లతా మంగేష్కర్, భూపేన్ హజారిక, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి.. బిస్మిల్లాఖాన్, భీమ్సేన్ జోషిలకు భారతరత్న ఇచ్చారని .. బాలసుబ్రహ్మణ్యం కూడా అర్హుడేనన్నారు. 2001లో పద్మశ్రీ , 2011లో పద్మభూషణ్ కూడా ఇచ్చారని జగన్ గుర్తు చేశారు.
జగన్ ఈ లేఖ రాయడానికి ఒక్క రోజు ముందునే.. చంద్రబాబు కూడా లేఖ రాశారు. అయితే.. ఆయన ప్రధానమంత్రికి కాకుండా ముఖ్యమంత్రి జగన్‌కే లేఖ రాశారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం దివ్యస్మృతికి నివాళిగా నెల్లూరులో మ్యూజికల్ యూనివర్సిటీ పెట్టాలని.. బాల సుబ్రమణ్యం కాంస్య విగ్రహం ఏర్పాటుతో పాటు ఆ ప్రాంతాన్ని బాల సుబ్రమణ్యం కళాక్షేత్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. ప్రభుత్వ సంగీత అకాడమీకి ఎస్పీ బాలు పేరు పెట్టాలని, ఎస్పీ బాలు జయంతిని రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహించాలని సూచించారు. ఎస్పీ బాలు పేరిట జాతీయ పురస్కారం అందజేయాలని కూడా డిమాండ్ చేశారు.
అయితే చంద్రబాబు అడిగిన దాని కన్నా ఎక్కువగా చేయాలని .. ఎస్పీ బాలును మరింత ఉన్నత స్థానంలో చూడాలనుకున్న జగన్.. నేరుగా భారతరత్న కోసమే లేఖ రాశారు. అయితే.. చంద్రబాబు చేసిన సూచనల ప్రకారం.. రాష్ట్రం ఏమైనా గౌరవం ఇచ్చే చర్యలు తీసుకుంటారా లేదా అన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు. మొత్తానికి ముఖ్యమంత్రికి.. ప్రతిపక్ష నేతకు ఎస్పీ బాలుపై ప్రత్యేకమైన అభిమానం ఉంది ..అందుకే లేఖలు రాశారని అర్థం చేసుకోవాలి.