ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ విజయ సూత్రం.. తప్పుడు ప్రచారంతో ప్రత్యర్థుల్ని పడగొట్టడం. ప్రశాంత్ కిషోర్ అనే ఓ బీహారీ వ్యూహకర్తని పెట్టుకుని సోషల్ మీడియాలో వందల కోట్లు కుమ్మరించి.. ఓ కులానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసి.. మిగతా కులాలన్నింటినీ పోలరైజ్ చేసి సక్సెస్ అయ్యారు. అది చరిత్ర. అయితే.. ఆ తర్వాత కూడా అదే సాగుతోంది. రాజకీయ నేతలను టార్గెట్ చేస్తూనే ఇప్పుడు.. న్యాయవ్యవస్థపై దాడి ప్రారంభించారు.
ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు ఓ లేఖ రాశారు. ఆ లేఖ టాప్ సీక్రెట్. విచారణ కోరి.. ఆ లేఖ రాస్తే… సీజేఐ స్పందన కోసం వేచిచూడాల్సి ఉంది. కానీ రెండు రోజులు కాక ముందే.. ఆ లేఖను.. అధికార ప్రతినిధి ద్వారా మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేశారు. అందులో.. తమకు వ్యతిరేకంగా తీర్పులిచ్చిన న్యాయమూర్తుల నిజాయితీని శంకించారు. రకరకాల ఆరోపణలు చేశారు. మీడియాలో చర్చకు పెట్టే ఉద్దేశంతోనే ఇలా చేశారు. ఏదో ఓ ఆరోపణ జడ్జిలపై చేయడమే లక్ష్యం… వారి నైతికతను దెబ్బతీసి పబ్బం గడుపుకోవడమే టార్గెట్‌గా ఈ ప్రయత్నం జరిగిందనేది సులువుగా అర్థమయ్యే విషయమే.
ఇప్పటికే ఈ వ్యూహాన్ని రాజకీయ నేతలపై అమలు చేశారు. ఇష్టం లేని టీడీపీ నేతల్ని జైళ్లలో వేశారు. వారికి వ్యతిరేకంగా విపరీతంగా ప్రచారం చేశారు. వందల కోట్లు స్కాంలు అని అచ్చెన్నపై ప్రచారం చేశారు. కానీ ఒక్క రూపాయి కూడా దొరకలేదని … అరెస్ట్ చేసేటప్పుడు అన్నీ ఆధారాలు ఉన్నాయని చెప్పిన ఏసీబీ అధికారులు ప్రకటించారు. కానీ చేయాల్సినంత ప్రచారం చేసి అచ్చెన్న ఇమేజ్ను డ్యామేజ్ చేశారు. ఐదేళ్లు మంత్రిగా ఉండి.. రాజకీయ ప్రత్యర్థులకు చిన్న హానీ కూడా చేయని కొల్లు రవీంద్రను… ఏకంగా హత్య కేసులోనే ఇరికించారు. ఆయన కుట్ర పన్నారంటూ.., పోలీసులు కథలు చెప్పడం.. ఆ కథలను మీడియాలో విస్తృతంగాప్రచారం చేయడం జరిగిపోయాయి. వాస్తవానికి కొల్లు రవీంద్రను ఇరికించే కుట్ర పోలీస్ స్టేషన్ నుంచే జరిగిందని ఫోటోలతో ఆధారాలు బయటకు వచ్చాయి. కానీ… ప్రచారంతో కొల్లు రవీంద్ర పరువును ఇప్పటికే తీసేశారు.
ఇప్పుడు న్యాయమూర్తులపై .. న్యాయవ్యవస్థపై పడ్డారు. తీర్పులు వ్యతిరేకంగా వస్తూంటే.. ఎవరైనా సరిదిద్దుకుంటారు. హైకోర్టులో తీర్పులు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తారు. అక్కడ కూడా… ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగిలాయి. స్వయంగా జగన్మోహన్ రెడ్డి లేఖరాసిన సీజేఐ బోబ్డేనే… ఇంగ్లిష్ మీడియంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఆయన బెంచ్ ఎదుట ఏపీ ప్రభుత్వానికి చెందిన కొన్ని కేసులు ఉన్నాయి. రేపు ఆయనపైనా విమర్శలు.. ఆరోపణలు చేయరన్న గ్యారంటీ లేదు. మొత్తానికి నిందితుడికి.. న్యాయవ్యవస్థకి మధ్య ఓ పోరాటం సాగుతోందని సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి..!