2011 కడప లోక్ సభ ఉపఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినప్పుడు ఎన్నికల సంఘానికి సమర్పించిన ఎఫిడవిట్ లో తన ఆస్తుల విలువ రూ. 365 కోట్లుగా పేర్కొన్నారు. తన భార్య భారతి ఆస్తుల విలువ రూ.47.25 కోట్లని పేర్కొన్నారు. మళ్ళీ పులివెందుల శాసనసభ ఎన్నికలలో తన స్థిర,చరాస్తుల విలువ మొత్తం రూ.343 కోట్లని, తన భార్య పేరిట మొత్తం రూ.71 కోట్లు ఆస్తి ఉన్నట్లు పేర్కొన్నారు.
కానీ మొన్న ఈడి ఆయనకి చెందిన రూ. 750 కోట్ల విలువైన ఆస్తులని అటాచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయనకి, అయన భార్య భారతికి కలిపి మొత్తం రూ.414 కోట్లు ఆస్తి మాత్రమే ఉందనుకొంటే ఇంతవరకు ఈడి అటాచ్ చేసిన రూ.1,250 కోట్లు ఆస్తి ఎవరిది? అని ప్రశ్నిస్తే అది తమది కాదని జగన్మోహన్ రెడ్డి చెప్పలేరు. పైగా దాని కోసం ఈడి కోర్టులో న్యాయపోరాటం కూడా చేస్తుంటారు. ఈడి అటాచ్ చేస్తున్న ఆస్తులన్నీ తనవేనని వాదిస్తూ న్యాయపోరాటం చేస్తూ దృవీకరిస్తున్నప్పుడు మరి ఎన్నికల సంఘం ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.
ఎన్నికల అఫిడవిట్ లో కులం లేదా జన్మతేదీని తప్పుగా పేర్కొన్నందుకు అభ్యర్ధులని తిరస్కరిస్తున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి తన ఆస్తుల విలువని తక్కువగా చేసి చూపిస్తున్నారని తెలిసీకూడా ఎన్నికల సంఘం దానిని ఎందుకు నిరభ్యన్తఃరంగా స్వీకరిస్తోంది? ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అనే ప్రశ్నలకి ఎన్నికల సంఘమే జవాబు చెప్పాల్సి ఉంటుంది.
సాధారణంగా ఎన్నికలలో పోటీ చేసే రాజకీయ నాయకులు ఎన్నికల సంఘానికి సమర్పించే ఎన్నికల అఫిడవిట్ లో తమ ఆస్తుల విలువని తక్కువ చేసి చూపిస్తుంటారు. నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం, ప్రజాసేవ, సంస్కారం వంటి ఊతపదాలను చిలకలాగ వల్లించే జగన్మోహన్ రెడ్డి కూడా దీనికి అతీతుడుకాడని ఈడి అటాచ్మెంట్ తో మరొకమారు రుజువయింది.