సరస్వతి పవర్ వాటాల విషయంలో జగన్ రెడ్డి ఎన్సీఎల్టీని ఆశ్రయించి .. అందులో చెప్పిన అంశాలన్నీ అవాస్తవాలేనని ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల కౌంటర్ వేశారు. ప్రక్రియ అంతా చట్టబద్దంగా జరిగిందని.. కుటుంబంలో కుదుర్చుకున్న ఓ ఒప్పందం ప్రకారం అంతా జరిగిందని దాన్ని ఎన్సీఎల్టీకి తీసుకు రావడం జగన్ చేసిన తప్పిదమన్నారు. చట్ట ప్రకారమే షేర్ల బదిలీ జరిగినందున జగన్ వేసిన పిటిషన్ ను కొట్టివేయాలని షర్మిల, విజయమ్మ కోరారు.
తల్లి, చెల్లిపై తనకు ప్రేమ లేదని.. అందుకే ప్రేమపూర్వకంగా ఇంతకు ముందు ఇచ్చిన వాటాలను తాను వెనక్కి తీసుకోవాలనుకుంటున్నానని.. జగన్ ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేశారు. తన షేర్లు వారు అక్రమంగా బదిలీ చేసుకున్నారని ఆయన ఆరోపించారు. కంపెనీల చట్టాలను ఉల్లంఘించారన్నారు. అందుకే తన వాటాలను మళ్లీ తన పేరు మీద బదిలీ అయ్యేలా ఆదేశించాలని ఎన్సీఎల్టీకి వెళ్లారు. కానీ జగన్ చెప్పేదంతా అవాస్తవం అని.. అబద్దాలు చెబుతున్నారని తల్లి, చెల్లి అంటున్నారు. అంతా చట్టబద్దంగానే జరిగిందని అంటున్నారు.
జగన్ ఆస్తులు పంచేందుకు సిద్దంగా లేరు. అంతా తన స్వార్జితం అన్నట్లుగా ఉన్నారు. అయితే అవన్నీ వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు క్విడ్ ప్రో కో ద్వారా సంపాదించుకున్న ఆస్తులే కావడంతో అందరికీ వాటాలు ఉంటాయని షర్మిల వాదిస్తున్నారు. తండ్రి కూడా విజయసాయిరెడ్డికి అదే చెప్పారని వాదిస్తున్నారు. కుటుంబ ఒప్పందంలో భాగంగా యలహంక ప్యాలెస్ సహా పలు ఆస్తుల్ని రాసిచ్చినా వాటిని ఇప్పటికీ జగన్ తన అధీనంలోనే ఉంచుకున్నారు. ఈ వివాదం ఎప్పటికి తెర పడుతుందో కానీ.. వైఎస్ కుటుంబాన్ని మాత్రం .. ఆస్తుల వివాదం రోడ్డున పడేసింది.