ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలలో తెదేపా చేతిలో వరుసగా ఎదురుదెబ్బలు తింటునే ఉన్నారు జగన్. తెదేపాలో చేరిన తన పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించడానికి ఆయన పన్నిన వ్యూహాలన్నిటినీ తెదేపా చిత్తుచిత్తు చేస్తోంది. ఒకపక్క సభలో ఎదురు దెబ్బలు తింటుంటే, మరోపక్క పార్టీలో ఎమ్మెల్యేలు వరుసగా తెదేపాలో చేరిపోతూనే ఉన్నారు. దానికి తోడూ యావత్ మీడియా ఆయనపై కక్ష గట్టినట్లుగా అయన వ్యవహార శైలి, శాసనసభలో ఆయన అనుసరిస్తున్న తప్పుడు వ్యూహాల గురించి విమర్శనాత్మక కధనాలు ప్రచురిస్తున్నాయి. పుండు మీద కారం చెల్లినట్లు త్వరలో ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పేసి తెదేపాలో చేరబోతున్నారని తెదేపా వ్యూహకర్తలు ప్రచారం కొనసాగిస్తున్నారు. బహుశః అందుకే జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు కనిపిస్తున్నారు. ఆయన శాసనసభలో వివిధ అంశాలపై మాట్లాడుతున్నప్పుడు ఆయన హావభావాలు, మాటలు, ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా చంద్రబాబు నాయుడుని అజ్ఞాని, అహంకారి, మోసగాడు అని సంభోదిస్తున్నారు. సమస్యల గురించి మాత్రమే మాట్లాడవలసిన జగన్, ఆ పేరుతో ముఖ్యమంత్రిని ఆయన ప్రభుత్వాన్ని తిట్టడానికే పరిమితం అవుతున్నారు. వైకాపా తరపున సభలో మరెవ్వరూ కూడా మాట్లాడేందుకు అవకాశం కూడా ఇవ్వకుండా మొత్తం సమయం అంతా తనే వినియోగించుకోవడం వలన, ఆ పార్టీ సభ్యులు కొన్ని విషయాలలో తమ అధినేతకి అండగా నిలబడి మాట్లాడాలనుకొన్నప్పటికీ ఆయన వారికి ఆ అవకాశం కల్పించకపోవడంతో ఆయన వెనుక 57 మంది ఎమ్మెల్యేలున్నా సభలో ఆయన ఒంటరి వాడుగా మిగిలిపోతున్నారు. అది తెదేపాకు మంచి అవకాశం కల్పిస్తున్నట్లవుతోంది. తెదేపా తరపున ఒకరి తరువాత మరొకరు లేచి నిలబడి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తుంటే, జగన్ ఒక్కరే వాళ్ళందరికీ సమాధానాలు చెప్పుకోవలసిరావడం విశేషం.
శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ముందు తన బాష, బాడీ లాంగ్వేజ్ పై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి. సభలో సమస్యలపై లోతుగా చర్చిస్తే అధికార పార్టీకి, ప్రభుత్వానికి చాలా ఇబ్బంది కలిగుతుంది కనుక వాళ్ళు చర్చను పక్కదారి పట్టించేందుకు తప్పకుండా ప్రయత్నిస్తారనే సంగతి అందరికీ తెలుసు. అటువంటప్పుడు జగన్ సంయమనం కోల్పోయి సభలో నోటికి వచ్చినట్లు మాట్లాడితే అధికార పార్టీకి అదొక అవకాశంగా మారుతుందనే సంగతి జగన్ గ్రహిస్తున్నట్లు లేదు. ఉదాహరణకి అగ్రి గోల్డ్ వ్యవహారం, పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టు తదితర వ్యవహారాలపై ఆయన అనేక మంచి ప్రశ్నలు వేశారు కానీ వాటికి ప్రభుత్వం నుంచి సరయిన సంత్రుప్తికరమయిన సమాధానాలు రాబట్టలేకపోయారు. కారణం సంయమనం కోల్పోయి నోటికి వచ్చినట్లు మాట్లాడటమే.
అసలు సభలో ఎప్పుడూ తానొక్కడినే ఎందుకు మాట్లాడాలనుకొంటున్నారో ఆయనకే తెలియాలి. ఆయన చంద్రబాబు నాయుడుని దూషిస్తూ తన మనసులో అయన పట్ల ఉన్న ద్వేషాన్ని, ఆగ్రహాన్ని చల్లార్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ విషయంలో మాత్రం జగన్ పూర్తి మనసంతృప్తి పొందుతున్నారని చెప్పవచ్చును. అంతే…అదో తుత్తి.