వైసీపీలో ఇంత గందరగోళానికి కారణం ఏమిటన్నదానిపై ఆ పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. గతంలో నియోజకవర్గాల సమీక్షలు పెట్టి మరీ అభ్యర్థులపై క్లారిటీ ఇచ్చినా ఇప్పుడు ఉల్టాపల్టా కావడానికి జగన్ రెడ్డి సొంత స్ట్రాటజీల అమలు ప్రారంభించడమేనని భావిస్తున్నారు.
ఐ ప్యాక్ పై నమ్మకం కోల్పోయిన జగన్
ఐ ప్యాక్ పై పూర్తి స్థాయిలో జగన్ నమ్మకం కోల్పోయారు. వారిని ఈవెంట్ మేనేజర్లుగా మార్చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీకి ప్రచార కార్యక్రమాలుగా మార్చడం తప్ప చేస్తున్నదేమీ లేదు. వారు చేసే సర్వేలను నమ్మడం లేదు. బయట రెండు, మూడు సర్వే సంస్థలు ఇస్తున్న రిపోర్టులతో పాటు కొంత మంది వైసీపీ సానుభూతిపరులైన జర్నలిస్టులను పిలిచి జగన్ మాట్లాడుతున్నారు. వారు ఇచ్చే సలహాల మేరకు అభ్యర్థుల మార్పు తలపెడుతున్నారు. జగన్ రెడ్డికి ఏదో ఒకటి చెప్పాలని వారు.. అభ్యర్థుల మార్పును సూచిస్తున్నారు.
ఎవరో గెలిపిస్తారని డెస్పరేట్గా జగన్
జగన్ రెడ్డి ఎవరో గెలిపిస్తారని.. ఆశ పడుతున్నారు. గతంలో కడప పర్యటనకు వెళ్లినప్పుడు 175 స్థానాల్లో గెలిపించే చిట్కా తన దగ్గర ఉందని ఓ వ్యక్తి వినతి పత్రం ఇస్తే.. వెంటనే అధికారుల్ని పంపించి ఎస్కార్టులో ఆ వ్యక్తిని పిలిపించుకుని మాట్లాడారు జగన్. ఆ వ్యక్తి ఏ చిట్కా ఇచ్చారో కానీ.. అలాంటి సలహాల్ని వినేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఎవరో ఒకరు.. మైండ్ బ్లోయింగ్ సలహా ఇస్తారని.. అది గెలిచిన తర్వాతే తెలుస్తుదన్నట్లుగా అందరి సలహాలు తీసుకుని ఇంప్లిమెంట్ చేస్తున్నారు.
ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని స్థితిలో నేతలు
వైసీపీ నేతలు పూర్తిగా ఆశలు వదిలేసుకున్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ తెలియదని.. టెన్షన్ పడటం దండగని అనుకుంటున్నారు. అందుకే టిక్కెట్ లేదని తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి లీకులు వస్తున్నా చాలా మంది కలిసేందుకు ఆసక్తి చూపించడం లేదు.