కాపు రిజర్వేషన్లు ఇవ్వలేనన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ప్రకటనపై కాపు ఉద్యమనేత మద్రగడ పద్మనాభం… తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాపులను ఓట్లు అడిగే అర్హతను జగన్ కోల్పోయారని ముద్రగడ స్పష్టం చేశారు. అంతే కాదు.. ఆయన చంద్రబాబును ప్రశంసించే ప్రయత్నం కూడా చేశారు. చంద్రబాబు రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం చేస్తున్నారని.. దాన్ని .. జగన్ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కాపు రిజర్వేషన్ల అంశంపై.. జగన్ యూటర్న్ తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మొత్తం రిజర్వేషన్లకు వ్యతిరేకమా.. లేక.. కాపు రిజర్వేషన్లకేనా చెప్పాలని జగన్ను ముద్రగడ డిమాండ్ చేశారు. తమను జగన్ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రిజర్వేషన్లు తన చేతిలో లేవన్న జగన్ ప్రకటనపై ముద్రగడ ఎలా స్పందిస్తారన్న ఆసక్తి చాలా మంది ఉంది. ఎందుకంటే.. వైసీపీతో ఆయన సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ముద్రగడ ఉద్యమానికి భూమన కరుణాకర్ రెడ్డి ఆర్థికంగా అండగా నిలిచారని టీడీపీ నేతలు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. అయితే.. అనూహ్యంగా ముద్రగడ .. వైసీపీ అధినేతపై పూర్తి స్థాయిలో విరుచుకుపడ్డారు. రిజర్వేషన్లు కేంద్ర పరిధిలోని అంశం అయితే.. ఒక్కో నియోజకవర్గంలో ముగ్గురు కాపు నేతల్ని ఎందుకు ఎగదోస్తున్నారని..ప్రశ్నించారు. కేంద్ర పరిధిలోని అంశంపై ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాపు కార్పొరేషన్ రెట్టింపు నిధులు ఇస్తామన్న జగన్ ప్రకటనను ఆయన ఖండించారు. సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారన్నారు.
ఒక్క కాపు రిజర్వేషన్ల అంశంపైనే కాకుండా.. ఇతర రాజకీయ హామీల విషయంలోనూ జగన్ పై ముద్రగడ విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి పదవి పొందేందుకు అలవి కాని హామీల్ని జగన్ ఇస్తున్నారని విమర్శించారు. జగన్ ఇచ్చే హామీల్ని అమలు చేయడానికి కేంద్ర బడ్జెట్ సరిపోతుంతా అని ప్రశ్నించారు. తమకు అండగా నిలిచేవారికే.. మద్దతిస్తామని… ముద్రగడ స్పష్టం చేశారు. ముద్రగడ వ్యతిరేక ప్రకటన…వైసీపీ వర్గాలను ఓ రకంగా షాక్కు గురి చేసింది. గతంలో కాపు రిజర్వేషన్ల అంశంతో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీని టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది. కానీ అదే ఇష్యూలో యూటర్న్ నిర్ణయం తీసుకోవడంతో… కాపు సామాజికవర్గం ముందు.. తాము తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని… వైసీపీ నేతలు ఆవేదన చెందుతున్నారు.