పని చేస్తున్న వారికి జీతాలివ్వకపోతే అన్నం కూడా సహించని బాధ్యతాయుతమైన వ్యక్తులు ఉంటారు. నెలంతా కష్టపడిన వారికి సమయానికి జీతాలివ్వడాన్ని తమ బాధ్యతగా భావిస్తారు. ఇలా చేయలేకపోతే సిగ్గుపడతారు. అంతే కానీ తాము ఉన్న డబ్బులతో జల్సా చేసి వారి పేరుపైనే అప్పులు తెచ్చి వారికి జీతాలిచ్చేంత వరకూ వెయి చేయాలని నిర్లక్ష్యంగా ఉండేవారు బాధ్యతాయుత పాలకులు కాదు. దురదృష్టం ఏమిటంటే ఇప్పుడు ఏపీలో లో ఇదే పరిస్థితి ఉంది.
సామాజిక పెన్షన్లు… జీతాలు.. పెన్షన్లు అన్నీ పెండింగ్
ఏపీలో నాలుగో తేదీ వచ్చింది. వృధ్దులకు.. ఒంటరి మహిళలకు ఇచ్చే సామాజిక పెన్షన్ల పంపిణీ వంద శాతం పూర్తి కాలేదు. 90 శాతం మంది ఉద్యోగులకు జీతాలు రాలేదు. వంద శాతం మంది రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు రాలేదు. గతంలో బటన్లు నొక్కిన పథకాలకు పూర్తి స్థాయిలో డబ్బులు జమ కాలేదు. కాపునేస్తం బటన్ నొక్కుతానని నెలాఖరులో సభ కు ప్రణాళిక ప్రకటించి ఆ తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయారు. ఓ వైపు కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. బటన్లు నొక్కడానికి వెళ్లినప్పుడు హెలిప్యాడ్లు, బారికేడ్లను కట్టే కాంట్రాక్టర్లకూ డబ్బులు చెల్లించలేదు. పరిస్థితి చెప్పాలంటే… ఖజానాలో చిల్లిగవ్వ లేనట్లుగా వ్యవహారం ఉంది.
లగ్జరీ ఫ్లైట్లలో సీఎం జగన్ రెడ్డి విదేశీ పర్యటనలు
రెండో తేదీన .. ఎవరికీ జీతాలు పడలేదు. పెన్షన్లు రాలేదు. కానీ సీఎం జగన్ రెడ్డి కోసం విజయవాడ విమానాశ్రయంలో రెండు ప్రత్యేక విమానాలు ఉన్నాయి. ఒకటి ఉదయమే వైఎస్ కు నివాళులు అర్పించడానికి కడపకు వెళ్లి రావడానికి.. మరొకటి… లండన్ కు వెళ్లడానికి. వీటికి అయిన ఖర్చు కోట్లలోనే ఉంటుంది. విదేశీ పర్యటనకు కూడా స్పెషల్ ఫ్లైట్లలో అదీ కూడా .. వ్యక్తిగత పర్యటనలకు వెళ్లేంత జల్సా ఏపీ సీఎంది. ఆయన వైభోగం చూసి వేల కోట్ల వ్యాపారం చేస్తున్న పారిశ్రామికవేత్తలు కూడా ఆశ్చర్యపోవాల్సిందే.
ప్రజల సొమ్మును సొంతానికి ఇలా వాడుకుంటారా ?
ప్రజాధనం అంటే సొంత ధనం అన్నట్లుగా కామన్ అయిపోయింది. వచ్చిన ఆదాయం నుంచి వాడుకున్నంత వాడుకుని మిగిలినది ప్రజలకు పంచుతానన్నట్లుగా తీరు ఉంది. ఇష్టారీతిన సొంత వర్గ కాంట్రాక్టర్లకు వేల కోట్ల చెల్లింపులు.. పనులేమీ జరగకపోయినా చెల్లించడం.. ఇసుక దోపిడీ సహా అనేక అరాచకాలు జరుగుతున్నా.. కళ్లు మూసుకోవడం కామన్ గా మారిపోయింది. మొత్తంగా ప్రజల ను తాకట్టు పెట్టి తెస్తున్నడబ్బుల్లో మళ్లీ వారి అకౌంట్లలో కొంత వేసి … మిగతా కొంత తమ జల్సాలకు… తమ వారి కాంట్రాక్టుల్లో జమ చేసుకుంటున్నారు. అంటే ప్రజలకు అప్పలు.. పాలకులకేమో జల్సాలు. ప్రజలు ఇప్పటికైనా ఓటు విలువ తెలుసుకోవాలేమో !