గుడివాడ అమర్నాథ్కు జగన్ మోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆయన తన గుండెల్లో ఉన్నారని.. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని అనకాపల్లి ప్రజల ముందు చెప్పారు. ఇప్పుడు అభ్యర్థిగా భరత్ ను గెలిపించాలని కోరారు. చేయూత పథకం బటన్ నొక్కేందుకు అనకాపల్లి పర్యటనకు వచ్చిన సీఎం జగన్.. అమర్నాథ్ పోటీపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అమర్నాథ్ పై కీలక కామెంట్లు చేశారు.. కుడి, ఎడమ అమర్నాథ్, భరత్ వున్నారు ఇద్దరు తమ్ముళ్లు… అమర్నాథ్ కు భవిష్యత్ లో చాలా మంచి జరుగు తుంది.. నా గుండెల్లో పెట్టుకుంటాను అన్నారు. భరత్ పోటీ చేస్తున్నాడు ఆశీర్వదించండి అని విజ్ఞప్తి చేశారు.
ఆ సమయంలో గుడివాడ అమర్నాథ్ ఫేస్ లో రకరకాల ఎక్స్ ప్రెషన్స్ వచ్చాయి. ఇంకా ఏమైనా చెబుతారేమో.. తన సీటు గురించి ఎమైనా ప్రకటన చేస్తారేమోనని ఆశగా ఎదురు చూశారు. అమర్నాథ్కు అనకాపల్లి పార్లమెంట్ సీటు అయినా ఇస్తారని అనుకున్నారు. అలా కూడా ఇచ్చే అవకాశం లేదని తాజా పరిణామంతో తేలిపోయిందని విశాఖ వైసీపీ వర్గాలు ఓ నిర్ణయానికి వచ్చాయి.
మంత్రి అమర్నాథ్ అనకాపల్లి, చోడవరం, గాజువాక నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశపడ్డారు. అయితే ఈయన ఆశలపై పార్టీ నీళ్లు చల్లింది. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నియోజకవర్గానికి మలసాల భరత్ ను ఇన్ చార్జీగా నియమించారు. గాజువాక కు ఉరుకూటి చందు… చోడవరం కి ధర్మశ్రీలను ఇన్ చార్జీలుగా వైసీపీ నాయకత్వ ప్రకటించింది. ఇన్ చార్జీలే పార్టీ అభ్యర్థులు అంటూ తాజాగా జగన్ ప్రకటించడంతో తాను పోటీ చేయాలనుకున్న మూడు నియోజకవర్గాల్లో మంత్రి అమర్ కు సీటు గల్లంతయిందన్న విషయం స్పష్టమైంది.