ఆర్టీసీ కార్మికుల సుదీర్ఘ స్వప్నాన్ని జగన్ కొత్త దశాబ్దంలో నెరవేరుస్తున్నారు. జనవరి ఒకటో తేదీ నుంచి ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారబోతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. తాము వస్తే.. విలీనం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఆ ప్రకారం.. అధికారం చేపట్టగానే..ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించారు. కానీ అది సాంకేతికంగా అసాధ్యమని చెప్పడంతో.. ఉద్యోగుల్ని మాత్రం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించారు.
ఈ మేరకు చట్ట సవరణ చేశారు. రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఒక్క ఉద్యోగి కూడా ఉండరు. అందరూ ప్రజారవాణా అనే ప్రభుత్వ విభాగంలో ఉద్యోగులుగా ఉంటారు. జీతాలు వారికి నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లిస్తారు. ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రభుత్వ ఖజానా నుంచే జీతాలు అందుతున్నాయి. పని మాత్రం ఆర్టీసీకి చేయాల్సి ఉంటుంది. మొత్తం 51వేల మంది వరకూ ఉద్యోగులు .. ప్రభుత్వ ఉద్యోగుల జాబితాలో చేరారు.
అయితే.. జీతాలు ప్రభుత్వ ఖాతా నుంచి ఇస్తున్నారు కానీ.. నిజంగా ప్రభుత్వ ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలపై మాత్రం.. ఇంత వరకూ ప్రభుత్వం ఏ నిర్ణయ తీసుకోలేదు. దీంతో ఉద్యోగుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. అయితే.. ముందు ముందు ఈ ఇబ్బందుల్ని పరిష్కరిస్తామని ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చారు. విలీన వేడుకలను ప్రతి డిపోలోనూ.. జనవరి ఒకటో తేదీన ఘనంగా జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.