మందు బాబుల సర్వాన్ని మద్యం కోసం ఖర్చు పెట్టేలా రేట్లు పెంచి.. వారితో మద్యం మాన్పించాడనికే అని గడుసుగా చెప్పినట్లుగానే… వారి ఆస్తులపై వారికి సర్వ హక్కులు ఇస్తామని చెప్పి రూ. పది.. ఇరవై వేలు వసూలు చేస్తున్నట్లుగానే ఇప్పుడు ఉద్యోగులకు సరికొత్త పీఆర్సీ అమల్లోకి రాబోతోంది. పే రివిజన్ కమిషన్ నివేదిక అసలు బయటపెట్టలేదు. కానీ కార్యదర్శుల కమిటీ ఇచ్చిన సిఫార్సులను మాత్రం బయట పెట్టారు. ఆ సిఫార్సులు అమలు చేస్తే జీతం స్థాయిని బట్టి రూ. పది వేల నుంచి ఇంకా ఎక్కువే తగ్గిపోతుంది. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వానికి ఈ సిఫార్సులు అద్భుతంగా ఉంటాయనడంలో సందేహం లేదు.
ఉద్యోగుల జీతాలు తగ్గిస్తామని పీఆర్సీ నేరుగానే చెప్పింది. ఇప్పుడు ఉద్యోగులు పెంచడం సంగతి తర్వాత అసలు తగ్గించవద్దు మహా ప్రభో అని ప్రభుత్వ పెద్దల వద్దకు కాళ్ల బేరానికి రావాల్సిందే. ఎంత చేయాలో అంతా చేసిన తర్వాత జగనన్న ఉద్యోగుల రక్షణ పేరుతో .. పీఆర్సీ సిఫార్సులు ఎలా అమలు చేసినా ఇప్పుడు వస్తున్న జీతం తగ్గకుండా ఆయా ఉద్యోగులందరికీ పర్సనల్పేగా ఆ లోటు భర్తీ చేస్తామని చెప్పే అవకాశం ఉంది. అంటే… లేనిపోని కష్టాలు తీసుకొచ్చి.. పరిష్కరించామని చెప్పడమన్నమాట.
మూడు రోజుల కిందట ఇంటలిజెన్స్ లీక్ పేరుతో ప్రభుత్వం నుంచి ఓ మెసెజ్ అందరికీ వచ్చింది. దాని ప్రకారం 34 శాతం ఫిట్మెంట్ అని.. అదని.. ఇదని చెప్పుకున్నారు. తీరా చూస్తే అది 14 శాతమే ఉంది. ప్రస్తుతం 27 శాతం మధ్యంతర భృతి ఇప్పటికే ఇస్తున్నారు. అంటే పదమూడు శాతం జీతం తగ్గిస్తారన్నమాట. ప్రభుత్వం ఇలా చేస్తుందని తెలియక ఉద్యోగ సంఘాల నేతలు గింజుకుంటున్నారు. ఉద్యోగుల కడుపు మండిపోతోంది.
ఉద్యోగుల జీతభత్యాలకే వచ్చిన ఆదాయం అంతా పోతోందని ప్రభుత్వం వాదించడం ప్రారంభించింది. అధికార పత్రికలో అదే రాశారు. అంటే ఈ పీఆర్సీపై వెనక్కి తగ్గే అవకాశం లేదు. ఆర్టీసీ ఉద్యోగుల్ని విలీనం చేయడం… వాలంటీర్లు.. గ్రామ పంచాయతీలకు సమాంతరంగా సచివాలయ వ్యవస్థలు ఏర్పాటు చేయడం వంటి వాటితో జీతాల భారం అనూహ్యంగా పెరిగింది. కానీ ప్రభుత్వం ఆ విషయం చెప్పకుండా.. గతంలో పీఆర్సీ సిఫార్సు చేసిన దాని కంటే ఎక్కువ పీఆర్సీ ఇచ్చారు..అందువల్లే ఆర్థిక పరిస్థితి కుంగిపోయిందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే ఇప్పుడు ఉద్యోగులకు తర్వాత ఎన్ని గిలిగింతలు పెట్టినా జీతం తగ్గించడానికే ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతిమంగా మీ జీతంపై మీకు సంపూర్ణ హక్కులు ఇస్తున్నామని చెప్పి సంతృప్తి పరిచే అవకాశాలు ఉన్నాయన్న సెటైర్లు సహజంగానే ఉద్యోగ వర్గాల్లో పడుతున్నాయి.