ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిందితులకు బెయిల్ వచ్చినా చంద్రబాబు, టీడీపీనే కారణం అంటున్నారు. ఇప్పటి వరకూ న్యాయవ్యవస్థలో న్యాయమూర్తులపైనే ఆయన ఆరోపణలు చేసేవారు. తాజాగా.. లాయర్లుపైనా గురి పెట్టారు. నంద్యాలలో మైనార్టీ కుటుంబం ఆత్మహత్య కేసులో సీఐ సోమశేఖర్ రెడ్డితో పాటు హెడ్ కానిస్టేబుల్ను అరెస్ట్ చేశారు. ఇలా అరెస్ట్ చేయగానే వారికి అలా బెయిల్ వచ్చింది. బెయిల్ రాగానే కనీసం మీడియా కంట పడకుండా వారిని సహచరులు జాగ్రత్తగా తీసుకెళ్లిపోయారు. దీంతో బెయిల్ వచ్చే కేసులు పెట్టి.. ప్రభుత్వం నాటకం ఆడుతోందనే విమర్శలు వచ్చాయి. సలాం కుటుంబం ఆత్మహత్యపై మైనార్టీల్లో విస్తృతమైన చర్చ జరుగుతున్న సందర్భంలో కౌంటర్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి.. తన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి ఆన్ లైన్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముస్లింల కండువా వేసుకున్న జగన్.. మైనార్టీ నేతలపై.. తమ పార్టీ నేతలు పాల్పడుతున్న వేధింపుల గురించి మాట్లాడలేదు. కానీ.. పోలీసులకు బెయిల్ ఇప్పించిన న్యాయవాది తెలుగుదేశం పార్టీ వారంటూ విమర్శలు గుప్పించారు. టీడీపీ ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్న రామచంద్రరావు నిందితుల తరఫున బెయిల్ పిటిషన్ వేశారుని.. న్యాయస్థానంలో నిందితులకు బెయిల్ కూడా మంజూరైందని జగన్ చెప్పుకొచ్చారు. లాయర్ వృత్తి చేసేవారు .. తమ క్లయింట్లకు కోసం పని చేస్తారు. అందులో పార్టీలకు సంబంధం ఉండదు .. కానీ జగన్ మాత్రం లాయర్లకు కూడా టీడీపీ ముద్ర వేసి చెబుతున్నారు. నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి ఉంటే.. వారికి బెయిల్ వచ్చేది కాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. అయితే.. వాదించిన లాయర్ టీడీపీ కాబట్టి… తప్పు టీడీపీ దేనన్నట్లుగా చెబుతున్నారు. బెయిల్ రద్దు చేసేందుకు హైకోర్టును ఆశ్రయించాంమని జగన్ చెప్పుకొస్తున్నారు.
చంద్రబాబు ట్విట్టర్, జూమ్ల్లో మాత్రమే మైనార్టీలపై ప్రేమ చూపిస్తున్నారని.. తన ఆన్ లైన్ భేటీలో జగన్ విమర్శించారు. ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న తప్పుల విషయంలో.. ఏదో ఒకదానికి టీడీపీ ముద్ర వేస్తే పనైపోతుందన్నట్లుగా .. జగన్ తీరు ఉండటం.. రాజకీయవర్గాలను విస్మయ పరుస్తోంది. ఇలాంటి విషయాల్లో బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి.. టీడీపీ పై ఎదురుదాడి చేస్తే.. ఏం వస్తుందన్న ప్రశ్న సహజంగానే వస్తోంది.