ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. డిగ్రీని మరో ఏడాది పొడిగించారు. ఇంజినీరింగ్ చదువును కూడా మరో ఏడాది పొడిగించారు. ఇప్పుడు.. డిగ్రీ మూడేళ్లు చదవాల్సి ఉంటుంది. కానీ వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇది నాలుగేళ్లు అవుతుంది. ఇంజనీరింగ్ చదువు నాలుగేళ్లు అయితే.. వచ్చే ఏడాది నుంచి అది ఐదేళ్లకు మారుతుంది. ఇలా ఎందుకు అంటే… డిగ్రీలు, ఇంజినీరింగ్ చదువుతున్న వారందరికీ.. ఉద్యోగాలు రావడం లేదట.. అందుకే … వారందరికీ.. స్కిల్స్ నేర్పించేందుకు… ఏడాది సమయాన్ని కేటాయిస్తున్నారు. డిగ్రీ మూడేళ్లు, ఇంజినీరింగ్ నాలుగేళ్లు పూర్తయిన తర్వాత తప్పనిసరిగా ఒక ఏడాది అప్రెంటిస్ షిప్ చేయాలనే నిబంధనను ఉన్నత విద్యా మండలి తీసుకురానుంది.
డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన చాలా మందికి ఉద్యోగాలు రావట్లేదని డిగ్రీ, ఇంజినీరింగ్ చదువులను ఉపాధి, ఉద్యోగాలు కల్పించేలా తీర్చిదిద్దాలని జగన్ నిర్ణయించారు. నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి విద్యార్థులకు స్కిల్స్ మీద శిక్షణ ఇస్తారు. అప్రెంటిస్‌షిప్ చేసే ఏడాది సమయంలో విద్యార్థులకు ఫీజురీఎంబర్స్ మెంట్.. ఇతర పథకాలు పొందవచ్చు. ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన పథకం కింద కూడా ఏటా రూ.20వేలు కూడా ఇస్తారు. విద్యార్థుల్లో స్కిల్స్ పెంచాలనుకోవడం.. మంచి నిర్ణయమే కానీ.. దానికి ఏడాది సమయం కేటాయించడమే.. విద్యారంగ నిపుణుల్ని కూడా ఆశ్చర్య పరుస్తోంది.
మూడేళ్ల డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సుల్లో భాగంగానే లైఫ్ స్కిల్స్‌ను ఎందుకు పెట్టరన్న ప్రశ్న వస్తోంది. పరుగులు పెడుతున్న కాలంలో.. ఏడాది అత్యంత విలువైన సమయం. ఉద్యోగాలు పొందే వయసు కూడా.. క్రమం తగ్గుతూ వస్తోంది. పాతికేళ్లు దాటే సరికి.. ఉద్యోగాల్లో స్థిరపడాల్సినంత వేగం.. యువత కోరుకుంటోంది. ఈ సమయంలో… మరో ఏడాది.. లైఫ్ స్కిల్స్ పేరుతో… కాలేజీలోనే ఉంచడం.. యువతకు ఇష్టం ఉండకపోవచ్చంటున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి..!